తెలంగాణలో నో లాక్ డౌన్.. కేసీఆర్ సంచలన నిర్ణయం..

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతున్న వేళ, అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నాయి. కర్ఫ్యూ సడలింపు వేళల్ని పెంచుకుంటూ పోతున్నాయి. దాదాపుగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ, పగటిపూట వ్యాపార కార్యకలాపాలకు వెసులుబాటు ఇస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

అన్ని రకాల నిబంధనలు తొలగింపు..
ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 6 గంటలనుంచి, సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంది. దీన్ని మరో 4 గంటలు పెంచి సడలింపు ఇస్తారనుకుంటే, ఏకంగా తొలగింపు చేపట్టారు కేసీఆర్. నైట్ కర్ఫ్యూ కూడా ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు సీఎం కేసీఆర్ కి నివేదికలు అందించారు. వీటిని పరిశీలించిన కేబినెట్ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలన్నిటినీ పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. సెకండ్ వేవ్ తర్వాత లాక్ డౌన్ ని పూర్తి స్థాయిలో ఎత్తివేసిన తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం.

ఏపీలో సోమవారం నుంచి కొత్త నిబంధనలు..
ఏపీలో సోమవారం నుంచి కర్ఫ్యూలో మరిన్ని సడలింపులు అమలులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు అమలులో ఉన్నాయి. ఆ సడలింపుని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించబోతున్నారు. సాయంత్రం 6 నుంచి తరువాతి రోజు ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.