కోవిడ్ తో జ్ఞాపక శక్తి తగ్గుతుందా..? ఆసక్తికర పరిశోధన ఇది..

కోవిడ్ కారణంగా శ్వాస సమస్యలు ఎదురవుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో రకరకాల ప్రచారాలున్నాయి. నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఇతర కండరాల సమస్యలుంటాయని కొన్ని సర్వేల ద్వారా తేలింది. కోవిడ్ తదనంతర ఆరోగ్య సమస్యలపై లండన్ లోని యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ చేపట్టిన పరిశోధనలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. కాగ్నిటివ్ న్యూరోసైన్స్ డిపార్ట్ మెంట్ చేపట్టిన ఈ పరిశోధనలో కోవిడ్ నుంచి కోలుకున్న దాదాపు 80శాతం మందిలో జ్ఞాపకశక్తి సమస్యలు కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్ కేథరీన్‌ లవ్‌ డే ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ప్రతిరోజూ చేసే పనుల్లో ఎవరైనా వేటినైనా మరచిపోయారా..? అలా మరచిపోయిన అంశాలు ఎక్కువగా ఉన్నాయా లేదా, తరచూ మరచిపోతున్నారా అనే ప్రశ్నలతో ఈ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా దాదాపు 80శాతం మంది తాము బాగా గుర్తుంచుకున్న విషయాల్లో ఏదో ఒక భాగాన్ని మరిచిపోతున్నట్టు తెలిపారు. ఏదో ఒక సంఘటన లేదా చేయాల్సిన పనిని మరిచిపోతున్నట్లు 55 శాతం మంది వెల్లడించారు.

కోవిడ్ కారణంగా 30శాతం మందిలో మెదడు పనితీరు, ఆలోచనలు కూడా ఏదో ఒకరూపంలో ప్రభావితమైనట్లు ఈ అధ్యయనం పేర్కొంది. కోవిడ్‌ పరిస్థితుల ప్రభావం మహిళలపై మరింత ఎక్కువగా ఉన్నట్టు, పురుషులతో పోల్చితే వారి జ్ఞాపకశక్తి మరింతగా తగ్గినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ కారణంగా మనుషుల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. కోవిడ్ సోకిన దశలో బంధువులు, స్నేహితులు మనసారా మాట్లాడకపోవడం, అభిప్రాయాలు, ఆలోచనల మార్పిడి లేకపోవడంతో వ్యక్తిత్వం, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయని అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం మనుషుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై సుదీర్ఘకాలం పాటు ఉంటుందని వివరించారు.