ప్రకాష్ రాజ్ కు ఎదురుదెబ్బ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా 3 నెలలు టైమ్ ఉంటుండగానే ప్రకాష్ రాజ్
తొందరపడ్డారు. మీడియా ముందుకొచ్చి హంగామా చేశారు. ఏకంగా తన ప్యానెల్ ను కూడా ప్రకటించారు.
ఆయన తొందర పడ్డారా లేక వెనక నుంచి ఏ వర్గమైనా ఆయన్ను ఎగదోసిందా అనే సంగతి పక్కనపెడితే,
ప్రకాష్ రాజ్ కు ఇప్పుడో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.

లెక్కప్రకారం 3 నెలల్లో ఎన్నికలు జరపాలి. కానీ అది రూల్ మాత్రం కాదు. అసోసియేషన్ రూల్ బుక్స్ లో
ఆ నిబంధన లేదంట. పైపెచ్చు, అవసరమైతే ఇప్పుడున్న కార్యవర్గమే మరో ఆరేళ్ల వరకు కొనసాగేలా
బై-లా ఒకటి ఉందట. సరిగ్గా ఇక్కడే ప్రకాష్ రాజ్ కు ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు
చాలామంది.

ఎన్నికలు నిర్వహించాలా లేక ప్రస్తుతం ప్యానెల్ నే కొనసాగించాలా అనే విషయం ఇప్పుడున్న
కార్యవర్గంపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్లు తలుచుకుంటే తమ కమిటీ పదవీ కాలాన్ని మరో ఏడాది లేదా
రెండేళ్లు పొడిగించుకోవచ్చు. అదే కనుక జరిగితే ప్రకాష్ రాజ్ చేసిన హంగామా అంతా వృధా ప్రయాస
కింద మారిపోతుంది. ఆయన ప్రకటించిన ప్యానెల్ లోని సభ్యులు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది.
మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంప్రదాయం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తుందా లేక పదవీ కాలాన్ని
పొడిగిస్తుందా అనేది చూడాలి.