అమిత్​ షా పర్యటనలో ఇన్ని ఆంక్షలా? ఇది ప్రజాస్వామ్య దేశమేనా?

ఇటీవల అమిత్​ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్​లోని వెజల్​పూర్​ పరిధిలో అమిత్​ షా ఓ కమ్యూనిటీ హాల్​ను ప్రారంభించేందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అక్కడ కఠిన ఆంక్షలు విధించారు. అమిత్​ షా పర్యటన నేపథ్యంలో ఆ కాలనీ ప్రజలంతా కిటికీలు, తలుపులు మూసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కాలనీలో అనౌన్స్​మెంట్​ చేశారు. ఓ సర్క్యూలర్​ కూడా జారీ చేశారు.

300 ఇళ్లకు, ఐదు అపార్ట్​మెంట్లకు నోటీసులు అందించారు. ఈ నోటీసులపై పంక్తి జోగ్​ అనే ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు ఆస్తమా ఉందని.. అందుకే తాను కిటికీలు మూసి ఉండలేనంటూ ఆమె పీఎస్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పంక్తి జోగ్​ ఓ ఆర్టీఐ ఉద్యమకారిణి. ఆమె పోలీసుల తీరును తప్పుబడుతూ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ చేసింది.

ఇది ప్రజాస్వామ్య దేశమేనా? హోంమంత్రి వస్తున్నాడని సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తారా? దుకాణాలు అన్ని క్లోజ్​ చేస్తే .. ప్రజలు సరుకులు ఎలా తెచ్చుకుంటారు? ఇది ప్రజల హక్కులను హరించడమే.. అంటూ ఆమె పోస్ట్​ చేశారు. ఈ పోస్ట్​ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

మరోవైపు ఆమెకు పలువురు మద్దతు తెలిపారు. అయితే వెజల్​పూర్​ పోలీసుల వాదన మరోలా ఉంది. జెడ్​ క్యాటగిరీ భద్రతలో భాగంగా అలా చేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. అంతేకాక తాము ఎవరినీ బలవంతం చేయలేదని వారు పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షాపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఓ వైపు ప్రతిపక్షాలు, మరో వైపు మీడియా అమిత్​ షా పర్యటన నేపథ్యంలో పోలీసుల తీరును తప్పుబట్టాయి. ప్రజల హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని ప్రజాస్వామిక వాదులు అభిప్రాయపడుతున్నారు.