వాళ్లకు స్పుత్నిక్​ వీ సింగిల్​ డోస్​ చాలు..!

మనదేశంలో కరోనా వ్యాక్సినేషన్​ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవాక్జిన్​, కోవిషీల్డ్​ అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలోనే రష్యా తయారుచేసిన స్పుత్నిక్​ వీ కూడా పంపిణీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్​కు అత్యవసర అనుమతి వచ్చేసింది. కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు స్పుత్నిక్​ వీ సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​ ఇస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ మేరకు అర్జెంటీనా వేదికగా ఓ పరిశోధన సాగింది. ఈ పరిశోధన సైన్స్‌ డైరెక్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.
అర్జెంటీనాలో కరోనా వచ్చి నయమైన కొందరు ఆరోగ్యకార్యకర్తలను ఎంపిక చేసుకొని వారికి స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్​ ఇచ్చారు. అయితే తొలి డోసు తీసుకున్న 21 రోజుల్లోనే వారిలో 94 శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయి.

ఆ తర్వాత వారికి సెకండ్​ డోసు ఇచ్చినా యాంటి బాడీల సంఖ్య పెరగలేదు. దీన్ని బట్టి కరోనా సోకి తగ్గిన వాళ్లకు స్పుత్నిక్​ వీ మొదటి డోసు ఇస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు ఎంపికచేసి వాళ్లకు ఒక్కడోసు ఇవ్వడం మనదేశంలో సాధ్యమవుతుందా? అన్నది వేచి చూడాలి. మనదేశంలో కరోనా పరీక్షలు భారీ స్థాయిలో జరగలేదు. కేవలం లక్షణాలు ఉన్నవాళ్లకు మాత్రమే పరీక్షలు చేశారు. అయితే ఇలా చేయడం వల్ల మనదేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే చాన్స్​ ఉంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.