జగన్​ సర్కార్​ కీలక నిర్ణయం.. అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారు. అయితే ఇంకా చాలా రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, కోర్టు కేసులు తదితర సమస్యల వల్ల ఈ రిజర్వేషన్ల అమలులో జాప్యం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా జగన్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకున్నది. అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని జనవరి 2019లోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 15, 16 లను అనుసరించి సామాజిక, విద్యా పరంగా వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో (66/2021) విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, కాపు, క్షత్రియ కులాల్లోని పేదలు లబ్ధిపొందనున్నారు. జగన్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అగ్రవర్ణ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.