కోవిహోమ్.. ఇంట్లోనే కరోనా టెస్ట్

కరోనా టెస్టు కోసం బయటకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకునేలా ఓ కొత్త టెస్టింట్ కిట్ డెవలప్ చేశారు. కోవిహోమ్ పేరుతో తయారైన ఈ టెస్టింగ్ కిట్ తో ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. ముప్పై నిముషాల్లో కరోనా ఉందో లేదా నిర్థారించుకోవచ్చు.

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్.. కోవిహోమ్(COVIHOME) అనే కోవిడ్ -19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు. దీంతో డాక్టర్ అవసరం లేకుండానే ఇంట్లోనే కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ రిజల్ట్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ రిజల్ట్ తో సమానంగా ఉంటుందని ప్రొఫెసర్ శివ గోవింద్ అంటున్నారు. ఈ కిట్ ధర కూడా చాలా తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజీలో ఈ కిట్ పనితీరుపై ట్రయ‌ల్స్ కూడా జరిగాయి. కోవిహోమ్ తో పరీక్షించిన శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ పరీక్షలతో పోల్చి చూడగా 98శాతం ఆక్యురసీని కలిగి ఉందని తేల్చారు. ఈ కిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.