శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ మూవీ సంగతులు

బ్రహ్మోత్సవం దెబ్బతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇదే విషయంపై అడిగితే తను గ్యాప్
తీసుకోలేదని, అదే వచ్చిందని సరదాగా చెప్పుకొచ్చాడు. నిజమే… ఆ సినిమా రిజల్ట్ అలాంటిది మరి. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు నారప్పతో బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. ఈ సినిమా
తర్వాత కూడా తన నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని చెబుతున్నాడు అడ్డాల.

నారప్ప తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు ఈ దర్శకుడు. దీనికి అన్నాయ్ అనే
టైటిల్ ఫిక్స్ చేశారు. కేజీఎఫ్, బాహుబలి, పుష్ప సినిమాల టైపులో ఇది కూడా భాగాలుగా రాబోతోంది.
అవన్నీ రెండు భాగాలుగా వస్తే, అన్నాయ్ ప్రాజెక్ట్ మాత్రం 3 భాగాలుగా వస్తుందంటున్నాడు అడ్డాల.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మాత్రం
పూర్తయిందని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు ఈ సినిమాతో సంబంధం లేకుండా ఓటీటీకి వర్క్ చేయాలని
నిర్ణయించుకున్నట్టు తెలిపాడు అడ్డాల. సొంతంగా బ్యానర్ స్థాపించి, మనసుకు నచ్చిన చిన్న చిన్న
కథలతో స్వీయదర్శకత్వంలో ఓటీటీకి సినిమాలు నిర్మించి ఇవ్వాలనే ఆలోచనను బయటపెట్టాడు.