నారప్ప మూవీ రివ్యూ

సినిమా: నారప్ప
తారాగణం: వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల, రాఖి
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు
నిర్మాత: డి సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ: జూలై 20, 2021
రేటింగ్: 2.75/5

ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన తొలి పెద్ద సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది నారప్ప. వెంకటేష్ నటించిన ఈ
సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులోకి వచ్చింది. తమిళ్ లో క్లాసిక్ అనిపించుకున్న
అసురన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన నారప్ప, తెలుగు ఆడియన్స్ ను మెప్పించిందో లేదో చూద్దాం.

అనంతపురంలోని ఓ పల్లెటూరిలో భార్య సుందరమ్మ (ప్రియమణి) ముగ్గురు పిల్లలతో ఓ సాధారణ రైతు
జీవితం గడుపుతుంటాడు నారప్ప (వెంకటేష్). అనుకోకుండా నారప్ప పెద్ద కొడుకు ముని కన్నా (కార్తీక్
రత్నం)తో ఆ ఊరి పెద్ద పండు స్వామి (నరేన్) పొలం విషయంలో గొడవ పడతాడు. తనపై ఎదురుతిరిగిన
ముని కన్నాను తన మనుషులతో చంపిస్తాడు పండు స్వామి. అయితే కొడుకు చనిపోయినప్పటికీ నారప్ప
ప్రతీకారం తీర్చుకోవాలనుకోడు. కుటుంబాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తాడు. కానీ చిన్న కొడుకు
మాత్రం తండ్రి మనస్తత్వాన్ని సహించలేకపోతాడు. తల్లి బాధ చూసి తట్టుకోలేక, పండుస్వామిపై కక్ష
పెంచుకుంటాడు. మొత్తానికి పండుస్వామిని చంపేస్తాడు. దీంతో నారప్ప, తన చిన్నకొడుకును
రక్షించుకోవడం కోసం అతడ్ని తీసుకొని అడవిలోకి పారిపోతాడు. కుటుంబాన్ని సుందరమ్మ పుట్టింటికి
పంపించేస్తాడు. ఫైనల్ గా నారప్ప గతం ఏంటి? అతడు తన చిన్న కొడుకును కాపాడుకున్నాడా లేదా
అనేది స్టోరీ.

పేరుకు ఇది రీమేక్ సినిమానే అయినప్పటికీ ఒక్కసారి నారప్పను స్ట్రీమ్ చేస్తే అందులో లీనమైపోతాం.
రీమేక్ అనే విషయం మరిచిపోతాం. దీనికి కారణం ఒన్ అండ్ ఓన్లీ వెంకటేష్. తన నటనతో వెంకటేష్ ఈ
సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. నారప్పగా అతడి నటన జాతీయ అవార్డుకు ఏమాత్రం తీసిపోదు.
ఒక్కముక్కలో చెప్పాలంటే వెంకీ నటించాడు అనే కంటే జీవించాడు అనడం కరెక్ట్. ఇక సుందరమ్మగా
ప్రియమణి, పెద్ద కొడుకుగా కార్తీక్ రత్నం, చిన్న కొడుకుగా రాఖీ, రావు రమేష్, రాజీవ్ కనకాల తమ పాత్రల
మేరకు నటించారు.

నారప్ప ఎవరు, ఏంటి అనే ఉపోద్ఘాతాల జోలికి పోకుండా.. కొడుకును రక్షించుకోవడం అనే కాన్పెప్ట్ నుంచి
సినిమా స్టార్ట్ అవుతుంది. చిన్న కొడుకుతో కలిసి నారప్ప అడవిలో ప్రయాణం చేయడంతో కథ
మొదలవుతుంది. నారప్పను శాంతంగా, ఆలోచనపరుడిగా మాత్రమే ఫస్టాఫ్ లో చూపిస్తారు. చివరికి తన తప్పు లేకపోయినా ఊర్లో అందరి కాళ్లు మొక్కే తండ్రి నారప్పను చూసి కొడుకులు అసహ్యించుకుంటారు. అలాంటి నారప్ప గతంలో ఎలా ఉండేవాడు అనే అసలైన కోణం సెకండాఫ్ లో ఎలివేట్ అవుతుంది. కీలకమైన కథ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లోనే సాగుతుంది. ఇదేదీ శ్రీకాంత్ అడ్డాల కొత్తగా చెప్పలేదు. ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న స్క్రీన్ ప్లేనే యాజ్ ఇటీజ్ గా తీసుకున్నాడు.

టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికేం లేదు. ఒరిజినల్ వెర్షన్ ను యథాతథంగా దించడంలో
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, సంగీత దర్శకుడు మణిశర్మ సక్సెస్ అయ్యారు. ఇక దర్శకుడిగా
శ్రీకాంత్ అడ్డాల కూడా పెద్దగా కష్టపడలేదు. ఒరిజినల్ సినిమా అసురన్ ను మక్కికిమక్కి దించేశాడు.
అయితే కొన్ని పోర్షన్లలో మాత్రం తన దర్శకత్వం ప్రతిభను చూపించలేకపోయాడు. మరీ ముఖ్యంగా యంగ్ నారప్ప లుక్ లో వెంకీ నటించిన సన్నివేశాలు మరీ ఫ్లాట్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత 2-3 ఎపిసోడ్స్ చాలా నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి. ఒరిజినల్ వెర్షన్ లో ఆ ఫీల్ రాదు.

ఓవరాల్ గా నారప్ప సినిమాను వెంకీ పెర్ఫార్మెన్మ్ కోసం ఓసారి కచ్చితంగా చూడాల్సిందే.