ముసలోళ్లు పోతే పోయారు.. అందుకే లాక్ డౌన్ పెట్టలేదు..

కరోనా వైరస్ విజృంభణ వేళ లాక్ డౌన్ పెట్టకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు కలుగుతాయో అందరికీ తెలుసు. భారత్ లో కేసులు తగ్గుతున్నా కూడా ఇంకా చాలా రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తుండటానికి కారణం అదే. కొన్ని ఇతర దేశాలు కూడా కేసుల సంఖ్యతో సంబంధం లేకుండా ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. అయితే బ్రిటన్ లో మాత్రం అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తేసింది. ఓవైపు డెల్టా వేవ్ విజృంభిస్తున్నా కూడా ఆంక్షలు పెట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ సుముఖత చూపలేదు. దీంతో ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ దశలో ప్రధాని వద్ద గతంలో పనిచేసిన అధికారి డొమినిక్ కమ్మిన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ మరింత సంచలనంగా మారింది.

“బ్రిటన్ లో కొవిడ్ కారణంగా మరణిస్తున్నవారిలో అధికులు ముసలివారే. అందుకే ప్రధాని జాన్సన్ లాక్ డౌన్ పెట్టడానికి వెనకాడుతున్నారు. పోతే పోయాయి ముసలి ప్రాణాలు అంటూ ఆయన లైట్ తీసుకున్నారు.” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు డొమినిక్ కమ్మిన్స్. గతంలో ‘గెట్ కొవిడ్, లైవ్ లాంగర్’ అంటూ ప్రధాని మాట తూలిన విషయాన్ని కమ్మిన్స్ గుర్తు చేశారు.

గత శీతాకాలంలో బ్రిటన్ లో కొవిడ్‌ మరణాల శాతం అధికంగా ఉంది. అయితే అందులో ఎక్కువ భాగం 80 ఏళ్లు పైబడినవారే మరణిస్తుండటంతో ఉద్దేశపూర్వకంగానే ప్రధాని బోరిస్ జాన్సన్ రెండోసారి లాక్‌డౌన్‌ విధించలేదని పేర్కొన్నారు కమ్మిన్స్. కొవిడ్‌ బాధితుల కోసం నిత్యావసర మందులను కూడా కొనేందుకు కూడా ఆయన విముఖత చూపారని వెల్లడించారు.

బ్రిటన్ లో కొవిడ్ మరణాలకు ప్రభుత్వమే కారణమని డొమినిక్‌ కమ్మిన్స్‌ ఆరోపణలు చేశారు. తన కార్యాలయంలో కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ.. దాన్ని లెక్కచేయకుండా ప్రధాని, 95 ఏళ్ల ఎలిజిబెత్ రాణిని సైతం కలిశారని చెప్పారు. వృద్ధులను కలవకూడదనే నిబంధన ఉన్నా కూడా కావాలనే ఆయన దాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. అయితే మాజీ అధికారి కమ్మిన్స్ చేస్తున్న ఆరోపణలను బోరిస్‌ జాన్సన్‌ ప్రతినిధి కొట్టిపారేశారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రధాని అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను ప్రధానమంత్రి అమలుచేసినట్లు పేర్కొన్నారు.

కమ్మిన్స్ ఆరోపణలతో ప్రతిపక్షాలు ప్రధానిపై తీవ్రం విమర్శలు ఎక్కుపెట్టాయి. కొవిడ్ కట్టడిలో ఆయన విఫలమయ్యారంటూ దుయ్యబట్టాయి. తాజాగా డెల్టా వేరియంట్ తో బ్రిటన్ తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ దశలో కేసుల సంఖ్య పూర్తిగా కంట్రోల్ లోకి రాకపోయినా అక్కడ లాక్ డౌన్ ఎత్తివేశారు. ఈనెల 19నుంచి పూర్తి స్థాయిలో సడలింపులు ఇచ్చారు. “ఫ్రీడమ్ డేస్” పేరుతో బ్రిటన్ లో సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి.