26న యడ్డీ రాజీనామా..!

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ నెల 26న రాజీనామా చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఆయన రాజీనామా చేస్తారని చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఆయన ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల యడియూరప్ప ఢిల్లీ వెళ్లి.. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజీనామాపై వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి.

ఇవాళ యడియూరప్ప బెంగుళూరు శివార్లలోని కచరకనహళ్లి లోని ధన్వంతరి హోమ్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ‘ అధిష్ఠానం నిర్ణయమే నాకు శిరోధార్యం. నేను ఈనెల 26న రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక 25న బీజేపీ అధిష్ఠానం నుంచి ఈ మేరకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. నాకు ఎంతో కాలంగా లింగాయత్​లు అండగా నిలబడ్డారు. వారి ప్రోత్సాహం కొనసాగుతుందని భావిస్తున్నాను.

ఇక నేను రాజీనామా చేసిన అనంతరం ఎవరూ నిరసన ర్యాలీలు చేయొద్దు. ముఖ్యంగా నా మద్దతు దారులు సంయమనంగా ఉండాలి’ అంటూ ఆయన ప్రకటించారు. దీంతో యడియూరప్ప రాజీనామా చేయడం ఖాయమని తేలింది. అయితే చాలా రోజులుగా కర్ణాటకలో యడియూరప్పకు వ్యతిరేకంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆయన కుమారుడు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో అనవసరంగా తలదూరుస్తున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.

ఈ మేరకు పలుమార్లు.. ఆ పార్టీలోని సీనియర్లు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. అయితే యడియూరప్ప స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారన్న విషయంపై సందిగ్ధత నెలకొన్నది. ఇటీవల యడియూరప్ప ఢిల్లీకి తన కుమారుడిని తీసుకెళ్లారు. తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్​పై హామీ ఇవ్వాలని ఆయన ప్రధాని నరేంద్రమోదీని కోరినట్టు వార్తలు వచ్చాయి.

కర్ణాటకలో యడియూరప్ప చాలా కాలంగా బీజేపీకి అండగా నిలబడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన కులం బీజేపీకి అండగా నిలబడింది. ఇదిలా ఉంటే తాజాగా లింగాయత్​ సామాజిక వర్గానికి చెందిన వారినే ముఖ్యమంత్రి చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.