తమిళనాడులో ప్రతీకార పర్వం మళ్లీ మొదలైందా..?

తమిళనాట జయలలిత, కరుణానిధి.. మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో సాగిందో అందరికీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఒకరినొకరు అరెస్ట్ చేయించి తమ ప్రతీకార జ్వాలను చల్లార్చుకున్నారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇప్పుడు కొత్త తరం రాజకీయాలు మొదలయ్యాయి. అయితే ప్రతీకార పర్వం మాత్రం కొనసాగుతూనే ఉందని మరోసారి స్పష్టమైంది. తాజాగా అన్నాడీఎంకే మాజీ మంత్రి విజయ భాస్కర్ నివాసంలో ఆయన సన్నిహితుల నివాసాల్లో దాదాపుగా 20చోట్ల సోదాలు జరిగాయి. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు జరిగినట్టు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఎంసీ) అధికారులు చెబుతున్నారు.

తాము అధికారంలోకి వస్తే అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణ జరిపిస్తామని, అక్రమాలన్నీ బయటకు తీస్తామని ఎన్నికల హామీగా ప్రకటించారు స్టాలిన్. సీఎంగా ఎన్నికైన 100రోజుల్లోపే ఆయన తన హామీని అమలులో పెట్టారు. రవాణా శాఖ మాజీ మంత్రి విజయ భాస్కర్ తో ఆ ఎపిసోడ్ మొదలైంది. ప్రతిపక్షంలో ఉండగా.. రవాణా శాఖలో జరిగిన అవినీతిపై మద్రాస్ హైకోర్ట్ లో కేసు కూడా వేశారు డీఎంకే నేతలు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాఖలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నారు. అప్పటి మంత్రిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరూర్ జిల్లాలో ఆయన నివాసం, ఇతర ప్రాంతాల్లో ఏక కాలంలో మెరుపు దాడులు నిర్వహించి హడలెత్తించారు అధికారులు. అయితే దీనిపై ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతీకారం కోసమే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఎలాంటి కేసులనయినా చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు.

హిట్ లిస్ట్ లో ఓపీఎస్, ఈపీఎస్..
అన్నాడీఎంకే జమానాలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు కూడా హిట్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా వీరిద్దరి పేర్లను ప్రస్తావిస్తూ.. అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు స్టాలిన్. తాము అధికారంలోకి వచ్చాక అందరి జాతకాలు బయటకు తీస్తామంటూ స్టేట్ మెంట్లిచ్చారు. అన్నట్టుగానే ఆయన తన మాటల్ని ఆచరణలో పెట్టారు. తమిళనాట ఈ రివేంజ్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.