అసోం – మిజోరం బోర్డర్.. అంతర్జాతీయ సరిహద్దులకంటే అత్యంత సున్నితం..

అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఇరు దేశాల భద్రతా దళాలకు గొడవలు జరిగే విషయం తెలిసిందే. అయితే భారత్ లో అంతకంటే సున్నితమైన ప్రాంతం ఒకటుంది. అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య 164.6 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు ప్రాంతం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటి. ఈ సరిహద్దు వెంబడి తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. అయితే దఫా జరిగిన గొడవల్లో అసోంకి చెంకిన ఆరుగురు పోలీసులు చనిపోవడం మాత్రం సంచలనంగా మారింది.

ఎందుకీ గొడవ..
రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలుంటాయి, ఆస్తుల పంపకాల మధ్య గొడవలుంటాయి. కానీ సరిహద్దు గొడవల్ని మాత్రం ఎవరూ ఎక్కువరోజులు కొనసాగించాలనుకోరు. వేరుపడిన రాష్ట్రాలకు వెంటనే సరిహద్దులు గుర్తిస్తారు, పంపకాలు పూర్తి చేస్తారు. కానీ 1972లో అసోం నుంచి మిజోరం వేరుపడిన తర్వాత ఇప్పటి వరకు సరిహద్దు వద్ద రావణకాష్టం రగులుతూనే ఉంది. అసోం కి బంగ్లాదేశ్, భూటాన్ దేశాలతోనూ సరిహద్దులు ఉండటం.. చొరబాటుదారుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 1995నుంచి ఈ గొడవలపై కేంద్రం సీరియస్ గా దృష్టిసారించి చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అయినా ఫలితం లేదు. గతేడాది కొవిడ్ వ్యాప్తి సమయంలో అసోంలోని లైలాపూర్ జిల్లాలో మిజోరం ఓ వైద్య శిబిరాన్ని, తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తమ భూభాగంలో మిజోరం పెత్తనం ఏంటని అసోం అధికారులు నిలదీశారు. దీంతో అప్పట్లో గొడవ మరింత ముదిరింది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. లైలాపూర్ సరిహద్దు జిల్లాలోని ఓ ప్రాంతం తమదేనని మిజోరం అంటోంది. సరిహద్దులు సరిగా గుర్తించకపోవడంతో స్థానికులకు ప్రభుత్వాలు కల్పించే ప్రయోజనాలు కూడా సరిగ్గా అందడం లేదు.

ఇప్పుడేం జరుగుతోంది..
ప్రస్తుతం వివాదం మరింత ముదిరి ఏకంగా దాడుల్లో పోలీసులు ప్రాణాలొదిలే వరకు వచ్చింది. అసోంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య తాజాగా జరిగిన ఘర్షణ హింసకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొందరు కాల్పులు జరపడంతో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్టు సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. మిజోరం సరిహద్దుల నుంచి జరిపిన కాల్పుల్లోనే వారు మృతిచెందినట్లు ఆరోపించారు. అటు మిజోరం సీఎం జోరంతంగా కూడా దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మిజోరంలోకి వస్తున్న ప్రజలపై అసోంలో దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ లను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సీఆర్పీఎఫ్ కి అప్పగించేలా తాత్కాలిక ఒప్పందం జరిగింది.