పవన్ సినిమా సంక్రాంతి విడుదల

సంక్రాంతి బరిలో నిలిచాడు పవన్ కల్యాణ్. అతడు నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను
సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి మరీ అధికారిక ప్రకటన చేశారు.

సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు పవన్. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు త్రివిక్రమ్, స్కీన్ ప్లే-డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు పవర్ స్టార్. ఈ క్యారెక్టర్ లుక్ ను ఈ రోజు మేకింగ్ వీడియోలో రిలీజ్ చేశారు.

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఆ షెడ్యూల్ లో తీసిన విజువల్స్ తోనే మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో రానా లుక్ ను కూడా బయటపెట్టినప్పటికీ, అతడి పాత్ర పేరు, స్వభావాన్ని
వెల్లడించలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రాబోతోంది ఈ సినిమా.