ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రచారం రెండో దశకు చేరుకుంది. ఇప్పటికే మేకింగ్ వీడియో రిలీజ్ చేసి అంచనాలు
పెంచిన యూనిట్, ఇప్పుడు సింగిల్స్ విడుదల కార్యక్రమాన్ని ఫిక్స్ చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఈ సింగిల్స్
రిలీజ్ కార్యక్రమం సాగుతుంది. ముందుగా దోస్త్ అనే థీమ్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

ఒకేసారి 5 భాషల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ఒక్కో భాషలో ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ
గాయకుడితో ఈ పాటను పాడించారు. తెలుగు వెర్షన్ ను హేమచంద్ర ఆలపించగా.. తమిళ్ లో ఈ పాటను
ప్రముఖ సంగీతదర్శకుడు అనిరుధ్ పాడాడు. ఇక హిందీలో అమిత్ త్రివేది, మలయాళంలో విజయ్
యేసుదాసు, కన్నడలో యాజిన్ నజీర్ ఆలపించారు.

వీళ్లందరితో కలిసి కీరవాణి దిగిన ఫొటోను కూడా విడుదల చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహాన్ని
ఎలివేట్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సినిమా ఆడియో రైట్స్ 25 కోట్ల రూపాయలకు అమ్మారు. తెలుగులో లహరి మ్యూజిక్ ఆ సినిమా ఆడియో, లిరికల్ వీడియో రైట్స్
దక్కించుకుంది. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది ఆర్ఆర్ఆర్.