కల్యాణమండపానికి మంచి రెస్పాన్స్

రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మారిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. తన రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా ఎస్ఆర్ కల్యాణమండపం. టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ – రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన ఈ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవ‌లే ఎస్ఆర్ క‌ళ్యాణమండంపం చిత్రాన్ని ఆగ‌స్ట్ 6న‌ థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ – రాజులు సన్నాహాలు చేస్తున్నారు. శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమాలో సాయికుమార్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్థానం, పోలీస్ స్టోరీ సినిమాల తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా తనకు అంతటి గుర్తింపు తీసుకొస్తుందని చెబుతున్నారు సాయికుమార్.