SR కళ్యాణమండపం మూవీ రివ్యూ

నటీనటులు: కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వల్క‌ర్, సాయికుమార్, తులసి, తనికెళ్ళభరణి , శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు
సంగీతం : చేతన్ భరద్వాజ్
నిర్మాణం : ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు : ప్ర‌మోద్, రాజు
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిర‌ణ్ అబ్బ‌వరం
ఎడిటింగ్ – ద‌ర్శ‌కుడు : శ్రీధ‌ర్ గాదే
విడుదల : 6 ఆగస్ట్ 2021
రేటింగ్: 2.25/5

ఓ సినిమా తీయాలనుకున్నప్పుడు అసలు ఆ సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్.
కథకు ఆత్మ చాలా ముఖ్యం. దానిచుట్టూ ఎన్ని కమర్షియల్ హంగులైనా అద్దుకోవచ్చు. అసలు ఆత్మనే
గాలికొదిలేసి రెండు పడవల ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? SR కళ్యాణమండపం సినిమాలా ఉంటుంది. అవును.. ఈ సినిమాలో తండ్రికొడుకుల మధ్య అనుబంధం, వాళ్ల మధ్య ఉన్న సమస్యకు పరిష్కారాన్ని చూపించాలనుకున్నారు. కానీ దాన్ని వదిలేసి, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, డ్యూయట్లు, కాలేజీ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పోనీ దాన్నే అలా కంటిన్యూ చేసి ఉంటే సరిపోయేదు. అకస్మాత్తుగా ఫాదర్ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారు. ఫైనల్ గా సింగిల్ షాట్ సీన్ తో ”తండ్రి సెంటిమెంట్” కు జస్టిఫికేషన్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ అప్పటికే స్క్రీన్ ప్లే గాడితప్పడంతో ”కళ్యాణమండపం” కళ తప్పింది.

ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ హీరోనే. కిరణ్ అబ్బవరం అన్నీ చూసుకున్నాడు. ఇదేదో ”ఘోస్ట్” వ్యవహారం కానేకాదు. భేషుగ్గా టైటిల్స్ లో తన పేరు కూడా వేసుకున్నాడు కిరణ్. రెండో సినిమాకే ఇంత టాలెంట్ ఉందని, ఇన్ని బాధ్యతల్ని చేపట్టినందుకు అతడ్ని మెచ్చుకోవాలా లేక నటన తప్ప, మిగతా అన్ని క్రాఫ్టుల్ని సగం సగం పూర్తిచేసి వదిలేశాడని మందలించాలో అర్థంకాదు. అవును.. నటుడిగా కిరణ్ వందశాతం మెప్పించాడు. అందులో నో డౌట్. అదే సమయంలో సంభాషణల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, కథారచయితగా ఇతడికి సగం మార్కులే పడతాయి.

సీమలోని ఓ చిన్న పట్టణంలో, చిన్న కళ్యాణమండపం. అదే పట్టణంలో ఓ కాలేజ్. హీరోహీరోయిన్ల
ప్రేమకబుర్లు. మరోవైపు కళ్యాణమండపాన్ని తీర్చిదిద్దాలనే హీరో ఆశయం. ఇంకోవైపు తండ్రితో వచ్చిన గ్యాప్ ను పూడ్చుకోవాలనే ఆరాటం. ఇలా సినిమాకు మంచి సెటప్ పెట్టుకున్నాడు కిరణ్. కానీ ఇన్ని హంగుల మధ్య దేన్ని హైలెట్ చేయాలో తన అనుభవరాహిత్యం వల్ల తెలుసుకోలేకపోయాడు. టైటిల్ లోనే
కళ్యాణమండపాన్ని పెట్టి ఒక్క పెళ్లిని కూడా సరిగ్గా చూపించలేకపోయారు. కనీసం కళ్యాణమండపాన్ని కూడా పూర్తిగా ఎలివేట్ చేయలేకపోయారు.

తండ్రికొడుకుల కాన్ ఫ్లిక్స్ పెట్టి.. దానికి రీజన్ ఏంటనే విషయాన్ని గట్టిగా చూపించలేకపోయారు. హీరో సింగిల్ షాట్ లో క్లైమాక్స్ కు ముందు ఏకథాటిగా సింగిల్ డైలాగ్ లో చెబితే తప్ప ఆడియన్ కు అసలు రీజన్ అర్థం కాదు. ఇలా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాల్ని పైపైన టచ్ చేసి, అంతగా అవసరం లేని ఎపిసోడ్స్ ను గంటలకొద్దీ సాగదీయడం కళ్యాణమండపానికి పెద్ద మైనస్ గా మారింది.

ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకునే అంశాలేమైనా ఉన్నాయంటే అది కిరణ్ అబ్బవరం నటన,
సాయికుమార్ సీనియారిటీ మాత్రమే. వీళ్లిద్దరూ తమ నటనతో సినిమాను నిలబట్టే ప్రయత్న చేశారు. మ్యూజిక్ డైరక్టర్ చేతన్ భరధ్వాజ్ తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వీళ్లకు కావాల్సినంత సపోర్ట్ అందించాడు. ఇక హీరోయిన్ గురించి, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇంత డిస్కషన్ లో దర్శకుడి పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు గమనించారా? ఈ సినిమాకు శ్రీధర్ గాదె
దర్శకుడు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కిరణ్ రెడీ చేసి ఇస్తే.. డైరక్షన్ ను పూర్తిస్థాయిలో చేయలేకపోయాడు కిరణ్. పైగా సినిమాకు ఎడిటర్ కూడా ఇతడే కావడంతో సెకండాఫ్ లో బోర్ కొట్టించాడు. అందుకే దర్శకుడి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. దర్శకుడిలానే హీరోయిన్ కూడా.

ఓవరాల్ గా కిరణ్ రాసుకున్న కళ్యాణ మండపం కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే దాన్ని బేస్ చేసుకొని అదిరిపోయే స్క్రీన్ ప్లే రాసుకొని, సాయికుమార్ లాంటి నటుడితో బలమైన సన్నివేశాలు పెట్టుకుంటే సినిమా పూర్తి స్థాయిలో మెప్పించేది. ఆ ప్రయత్నలోపం సినిమాలో అడుగడుగునా కనిపించింది.

ప్లస్ పాయింట్స్
– కిరణ్, సాయికుమార్ నటన
– సంగీతం
– సినిమా తొలి అర్థభాగం

మైనస్ పాయింట్స్
– సెకెండాఫ్
– స్క్రీన్ ప్లే
– ఎడిటింగ్
– బలమైన సన్నివేశాలు లేకపోవడం

బాటమ్ లైన్ – కళ తప్పిన కళ్యాణమండపం