కర్నాటకలో పిల్లలకోసం ఐసీయూ బెడ్స్..

కర్నాటక రాష్ట్రం థర్డ్ వేవ్ ని ఎదుర్కోడానికి సంపూర్ణంగా సిద్ధమవుతోంది. ఇటీవలే బెంగళూరులో 200కి పైగా చిన్నపిల్లలకు కరోనా సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై కీలక ఆదేశాలిచ్చారు. ‘వాత్సల్య’ పేరుతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు సరి కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. హవేరి, ఉడిపి జిల్లాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించారు. పిల్లలకు ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలను ఉచితంగా అందిస్తున్నారు.

రాష్ట్రంలోని కొవిడ్ ఐసీయూ బెడ్స్ లో 50శాతం బెడ్స్ ని పీడియాట్రిక్ బెడ్స్ గా మార్చుతున్నట్టు సీఎం బసవరాజ్ ప్రకటించారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో, 18ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాని సందర్భంలో కర్నాటక ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

సరిహద్దు రాష్ట్రాలతో భయం భయం..
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కూడా కేరళ, మహారాష్ట్ర ప్రభావం తమపై ఎక్కువగా పడిందని కర్నాటక ఆరోపించింది. ఇప్పుడు కూడా ఆరెండు రాష్ట్రాల వల్లే తమకు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు సీఎం బసవరాజ్ బొమ్మై. సరిహద్దు గ్రామాల్లోని చిన్నారులకోసం వైద్య సౌకర్యాలు మెరుగుపరిచామని, వైద్య పరీక్షల సంఖ్య పెంచామని చెప్పారు. మొత్తమ్మీద థర్డ్ వేవ్ భయాలతో కర్నాటక ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై.. ప్రత్యర్థులకు ఏ ఒక్క అవకాశాన్నీ ఇవ్వాలనుకోవడంలేదు.