ఆభరణాల కంపెనీల ప్రకటనతో వరకట్న కేసులకు లింకు..

“పెళ్లిలో మాకు కట్నం ఏమీ వద్దు, మీ అమ్మాయికి బంగారం పెట్టండి చాలు, పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకోండి.” చాలా కాలం క్రితమే ఇలాంటి ట్రెండ్ మొదలైంది. బంగారం రూపంలో కట్నం తీసుకోడానికి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఏమాత్రం మొహమాట పడటంలేదు. పైగా ఆ బంగారం అంతా అమ్మాయిదే అన్నట్టు, తమకేమీ వద్దన్నట్టు సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేస్తారు. అయితే ఇలాంటి వరకట్న బంగారానికి, ఆభరణాల కంపెనీల ప్రకటనలకు లింకు ఉందంటున్నారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్. ఇకపై ఆభరణాల కంపెనీలు తమ ప్రచారంలో మోడల్స్ ని పెళ్లి కుమార్తెలుగా చూపించొద్దని ఆయన సూచించారు.

కేరళలో వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ చేసిన వ్యాఖ్యలు కొన్నాళ్లుగా సంచలనంగా మారుతున్నాయి. డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు విద్యార్థులతో తాము కట్నం తీసుకోబోమంటూ ఓ బాండ్ రాయించుకోవాలని ఆయన అన్ని యూనివర్శిటీలకు గతంలో సూచించారు. ఒకవేళ వారు భవిష్యత్ లో కట్నం తీసుకున్నట్టు రుజువయితే సర్టిఫికెట్ ఆటేమేటిక్ గా క్యాన్సిల్ అయ్యేలా నిబంధనలు రూపొందించాలని చెప్పారు. ఆమధ్య ఓ వరకట్న బాధితురాలికి మద్దతుగా ఒకరోజు ఉపవాస దీక్ష కూడా చేశారు గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్. తాజాగా ఆయన ఆభరణాల కంపెనీల అడ్వర్టైజ్ మెంట్లపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఆభరణాల ప్రకటనల్లో.. మోడల్స్‌ని పెళ్లి కుమార్తెల్లాగా చూపిిస్తున్నారు. ఇలాంటి యాడ్స్‌లో పెళ్లి కుమార్తె ఒంటి నిండా బంగారు ఆభరాణాలు వేసి ఉంటారు. దాంతో జనాలు పెళ్లి కుమార్తె అంటే అట్టహసంగా.. భారీగా నగలు ధరించాలని భావించే ప్రమాదం ఉంది. కాబట్టి, బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్‌ని పెళ్లి కుమార్తెలుగా చూపించకండి, దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.” అని అన్నారు గవర్నర్ ఆరిఫ్.

కాన్వొకేషన్‌ కార్యక్రమంలో విద్యార్థుల చేత కట్నం తీసుకోము, ఇవ్వము అని ప్రతిజ్ఞ చేయించారు. కాలేజీలో చేరే సమయంలోనే “కట్నం ఇవ్వం, తీసుకోం” అని బాండ్‌ తీసుకోవాలని యూనివర్శిటీ ఉన్నతాధికారులకు సూచించారు. వరకట్న దురాచారాన్ని తొలగించడానికి కఠిన చట్టాలతో పాటు ప్రజల్లో అవగాహన కూడా పెరగాలన్నారు ఆరిఫ్.