పార్లమెంట్ లో చేసే చట్టాలపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు..!

పార్లమెంట్ లో చేస్తున్న చట్టాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్ లో చేసే చట్టాల పై కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్ లో లోతైన చర్చలు జరపకుండానే చట్టాలను చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో..ఆ చట్టం దేనికి ఉద్దేశించిందో.. తెలియకుండా పోతుందని అన్నారు. చట్టాలు చేసే సమయంలో నాణ్యమైన చర్చలేకుండా చట్టాలను చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

చట్టసభల్లో మునుపటిలా మేధావులు ఎక్కువగా లేకపోవడం వల్లే చట్టాలకు సంబంధించిన చర్చ సరిగ్గా జరగడం లేదని అన్నారు. పార్లమెంట్ లో చేసే చట్టాల్లో ఎన్నో లోపాలు ఉంటున్నాయని, దీంతో కోర్టుల్లో వ్యాజ్యాలు పెరుగుతున్నాయని తెలిపారు. సరైన చర్చలేకుండా తీసుకొచ్చిన చట్టాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారంగా మారతాయని అభిప్రాయపడ్డారు. గతంలో చట్టసభల్లో మేధావులు, న్యాయవాదులు సభ్యులుగా ఉండేవారని, వారు ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు చేసే చర్చల్లో నాణ్యత ఉండేదని అన్నారు.

ప్రస్తుతం పార్లమెంట్ లో మేధావులు తక్కువగా ఉండడంతో లోతైన విశ్లేషణ కరువైందని సీజేఐ అన్నారు. దేశంలోని న్యాయవాదులకు సంపాదనే పరమావధిగా కాకూడదని, వారు రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో కి రావాలని సీజేఐ సూచించారు. పార్లమెంట్ లో చేస్తున్న చట్టాలపై సీజేఐ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.