బడిబాటకు ఓకే.. ఏపీలో తొలిరోజు 60శాతం హాజరు..

ఏపీలో ప్రభుత్వం స్కూల్స్ తెరిచినా, తల్లిదండ్రుల నుంచి స్పందన ఎలా ఉంటుందోననే అనుమానం అందరిలో ఉంది. అయితే అలాంటి అనుమానాలేవీ లేకుండా తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 60శాతం మంది పిల్లలు స్కూల్స్ కి హాజరయ్యారు. నాడు-నేడు కార్యక్రమం మొదలు కావడం, తొలిరోజు విద్యా కానుక ద్వారా పుస్తకాలు, బ్యాగ్ లు ఇస్తుండటంతో హాజరు ఎక్కువగా ఉందని అంటున్నా.. విద్యార్థుల్లో మునుపటి ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలను స్కూల్స్ కి పంపించడానికే ఇష్టపడుతున్నట్టు తొలిరోజు స్పష్టమైంది.

ఎక్కడికక్కడ కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నడుపుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లు అన్నీ ఆగస్ట్ 16తో తిరిగి ప్రారంభం కాగా, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మాత్రం కాస్త ఆలోచన ధోరణిలో ఉన్నాయి. ప్రభుత్వం వెనకడుగేస్తుందేమోనన్న ఉద్దేశంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పూర్తిగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆగస్ట్ -16న చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్ తిరిగి మొదలు కాలేదు. బుధవారం నుంచి ప్రైవేట్ స్కూల్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఈమేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు మొబైల్ సందేశాలు వెళ్లాయి.

మరోవైపు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ ఉపాధ్యాయులు తరగతులను నిర్వహిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు.. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వారం పది రోజుల్లో విద్యార్థులు పూర్తిశాతం హాజరవుతారని ఉపాధ్యాయ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జూనియర్ కాలేజీలలో మాత్రం మొదటి రోజు చాలా చోట్ల తరగతి గదులన్నీ ఖాళీగానే కనిపించాయి. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెద్దగా లేదు. ప్రైవేట్ కాలేజీలన్నీ బుధవారం నుంచి పునఃప్రారంభం అవుతాయని తెలుస్తోంది. వారం పదిరోజుల్లోగా ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుందని, సెప్టెంబర్-1నుంచి పూర్తి స్థాయిలో ఏపీలో కాలేజీలలో విద్యాబోధన మొదలవుతుందని స్పష్టమవుతోంది.