రాజ రాజ చోర మూవీ రివ్యూ

నటీనటులు : శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళ భరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ తదితరులు
మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ: వేదరామన్‌
నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరి , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నిర్మాత : టీజి విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌
రచన -దర్శకత్వం : హసిత్ గోలి
నిడివి : 149 నిమిషాలు
రేటింగ్ : 3/5

కథలు కొత్తగా పుట్టుకురావు. ఉన్న కథల్నే కొత్తగా చెప్పడం తెలియాలి. సరికొత్తగా చూపించడం నేర్చకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గా విజయం మన సొంతమౌతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, రాజ రాజ చోర సినిమాలో కథ కొత్తదేం కాదు, అందులో పాత్రలు కూడా కొత్తవి కావు. ఇంకా చెప్పాలంటే, 3-4 కథలు కలిపి తీశారు. మనకు తెలిసిన పాత్రల్నే అందులో చూపించారు. కానీ హిట్ కొట్టారు. అదే మేజిక్కు. ఎందుకంటే, ఈ సినిమాను అంత కొత్తగా, అంతే వినోదాత్మకంగా చెప్పారు కాబట్టి.

కొత్త దర్శకుడు హసిత్ గోలి పక్కా కొలతలతో వచ్చాడు. తన సినిమాలో వినోదం ఎంత చూపించాలి, రొమాన్స్ ఎంత చూపించాలి, ఎమోషన్ ఎంత పండించాలి, ఏ పాత్రను ఎక్కడితో కట్ చేయాలి లాంటి విషయాల్లో పక్కా క్లారిటీతో ఉన్నాడు. ఆ క్లారిటీనే సినిమాను కాపాడింది. హిట్ చేసింది. రాజరాజచోర సినిమాలో మొదటి భాగమంతా వినోదం పండుతుంది. ద్వితీయార్థం నుంచి డ్రామా, ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. చివరికి వచ్చేసరికి ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ మంచి సినిమా లక్షణం ఇదే. హీరో ఎవరైనా, బడ్జెట్ ఎంతైనా ప్రేక్షకుడు కోరుకునేది కూడా ఇదే

జిరాక్స్ షాపులో వర్క్ చేసే భాస్కర్(శ్రీ విష్ణు) తన భార్య విద్య(సునైనా), పిల్లాడి చదువు కోసం… అలాగే తన గర్ల్ ఫ్రెండ్ సంజన(మేఘ ఆకాష్) అవసరాలు తీర్చడం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాజు వేషధారణలో దొంగతనం చేస్తూ పోలీస్ ఆఫీసర్ విలియమ్స్ రెడ్డి (రవిబాబు) కి పట్టుబడతాడు.

భాస్కర్, విద్య భార్యభర్తలు అయినప్పటికీ ఇద్దరికి మాటలు ఉండవు. తన లాయర్ చదువుకి సంబంధించి ఫీజు కోసం మాత్రమే భాస్కర్ తో మాట్లాడుతుంది విద్య. ఈ క్రమంలో దొంగతనం చేస్తూ పోలీస్ కి పట్టుబడిన భర్తను తన లాయర్ బుర్రతో స్టేషన్ నుండి ఎలా బయిటికి తీసుకొచ్చింది? అసలు పెళ్ళాం ఉండగా భాస్కర్ సంజనతో ఎందుకు రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు? దొంగతనం కేసులో పట్టుబడిన భాస్కర్ ని పోలీస్ వదిలేశాడా? ఇంతకీ పోలీస్ కు, భాస్కర్ కు సంబంధం ఏంటి? చివరికి తను చేసిన తప్పులు తెలుసుకొని భాస్కర్ ఎలా మారాడు ? అనేది మిగతా కథ.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది 3-4 కథల సమాహారం అయినప్పటికీ ఎక్కడా అలా అనిపించదు.
దర్శకుడు అలా లింకులు కలిపేశాడు. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశాడు. పైగా ఈ సినిమా కొత్తగా అనిపించడానికి మరో కారణం ఏంటంటే.. ఇందులో పాత్రలన్నీ తప్పులు చేస్తాయి. కొన్ని పాత్రలు చివరికొచ్చేసరికి తమ తప్పు తెలుసుకుంటాయి. మరికొన్ని క్యారెక్టర్లు మాత్రం అలా తప్పులతోనే జీవితాన్ని సాగిస్తాయి. హీరో కూడా దీనికి అతీతీడు కాడన్నమాట. ఇది కొత్తగా ఉంది.

హీరో విష్ణుకు ఇలాంటి క్యారెక్టర్లు కొట్టిన పిండి. అలవోకగా నటించేశాడు. హీరోయిన్లలో ఎక్కువ మార్కులు
సునైనకే పడతాయి. లా స్టూడెంట్ గా, ఇండిపెండెంట్ వైఫ్ గా ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. గ్లామర్ తో కూడా మార్కులు కొట్టేసింది. మేఘా ఆకాష్ కూడా ఓకే. రవిబాబు కూడా తనకు అలవాటైన పాత్రలో జీవించేశాడు. గంగవ్వ, అజయ్ ఘోష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా కూడా సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. వివేక్ సాగర్ సినిమా సినిమాను నిలబెట్టింది. మరీ
ముఖ్యంగా సెకెండాఫ్ లో వివేక్ సాగర్ చించేశాడు. వేదరామన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక దర్శకుడు,
రచయితగా హసిత్ గోలికి నూటికి నూరు మార్కులు ఇచ్చేయొచ్చు. చేసింది తొలి సినిమానే అయినప్పటికీ.. ఎంతో పరిణతి చూపించాడు. పాటలు కూడా పెట్టాలన్నట్టు పెట్టలేదు. కథలో భాగంగా అలా వచ్చి వెళ్లిపోతాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల నిర్మాణ విలువలు
బాగున్నాయి.

అయితే సినిమాలో అన్నీ బాగున్నప్పటికీ పంటికింద రాయిలా సెకెండాఫ్ ప్రారంభమైన వెంటనే కొన్ని సోది సీన్లు పడతాయి. దీనికితోడు ఆ తర్వాత మెలొడ్రామా మొదలవుతుంది. ఇంకోవైపు కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ కనిపించవు. ఈ మైనస్ పాయింట్స్ పక్కనపెడితే.. రాజరాజ చోర సినిమా ఓవరాల్ గా అందర్నీ
మెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.