ఆఫ్ఘన్ లో సంక్షోభం.. భారత్ లో ధరల కల్లోలం..

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ వశం కావడంతో అంతర్జాతీయ సరిహద్దులు మూతబడ్డాయి. కేవలం విమానయానం ద్వారా మాత్రమే ఆఫ్ఘన్ లోని పౌరులు బయట దేశాలకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కు విమానాలు నడిపేందుకు కూడా ఏ దేశం సాహసించట్లేదు. ఆఫ్ఘన్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, వారెవరూ దేశం విడిచి వెళ్లొద్దని అంటున్న తాలిబన్లు, సరిహద్దుల్ని మూసేసి పహారా కాస్తున్నారు. దీంతో ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. పరోక్షంగా ఇది భారత్ లోని డ్రైఫ్రూట్ బిజినెస్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

అవును, భారత్ లో లభించే డ్రైఫ్రూట్స్ లో 85శాతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేవే. ఎండు ద్రాక్ష, వాల్‌ నట్, అత్తి, పైన్ గింజలు, బాదం, ఎండిన ఆప్రికాట్, పిస్తా, చెర్రీ.. వంటివాటిని మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పుచ్చకాయ, నేరేడు పెండు, ఇతర ఔషధ వనమూలికలు మన దగ్గర లభ్యమవుతున్నా.. దిగుమతులు కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ద్వారా ఇవన్నీ భారత్ కు దిగుమతి అవుతుంటాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తో ఉన్న సరిహద్దుల్ని కూడా పూర్తిగా మూసివేసింది. తమ దేశం నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఇనుప కంచెలు అడ్డం వేసి మరీ పహారా కాస్తున్నారు తాలిబన్లు. దీంతో డ్రైఫ్రూట్స్ దొంగరవాణా చేసేందుకు సైతం ఎవరూ ధైర్యం చేయడంలేదు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ మాటల్లో చెప్పాలంటే, ఇప్పుడల్లా ఆఫ్ఘనిస్తాన్ తో మనం వ్యాపార బంధాలు పునరుద్ధరించుకునే అవకాశాలే లేవు. డ్రైఫ్రూట్స్ దిగుమతులతోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం దొరికే అవకాశం లేదు కాబట్టి, మూడు నాలుగు రోజులుగా ఢిల్లీలోని డ్రైఫ్రూట్స్ షాపుల్లో రేట్ల వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తోంది. ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా, ఆప్రికాట్ వంటి వాటి రేట్లు మూడింతలు పెరిగాయి. రాబోయే రోజుల్లో వీటి రేట్లు మరింత పెరిగే అవకాశముంది.