కృష్ణా జిల్లా స్కూల్ లో కరోనా కలకలం..

దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరవడంపై ఇంకా ఓ ఉమ్మడి అభిప్రాయం రాలేదు. ఫస్ట్ వేవ్ సమయంలో అన్నిటికీ కేంద్రం అనుమతి ఇచ్చేది, ఆ తర్వాత తమపై నింద పడటం ఇష్టంలేక కేంద్రంలోని పెద్దలు అన్ లాక్ విషయాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈనెల 16నుంచి స్కూల్స్ మొదలయ్యాయి. ఒకటినుంచి పదో తరగతి వరకు స్కూల్స్ ప్రారంభించారు. కాలేజీలు కూడా తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు స్కూల్ లో కరోనా కలకలం సృష్టించింది.

పెదపాలపర్రు హైస్కూల్ లో 10మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ప్రతి స్కూల్ లో వారానికోసారి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం స్కూల్ విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేపట్టారు. వాటి ఫలితాలు ఈరోజు వచ్చాయి. మొత్తం 10మంది విద్యార్థులకు కరోనా వచ్చినట్టు తేలింది. దీంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. అధికారులు స్కూల్ కి సెలవు ప్రకటించారు. తిరిగి స్కూల్ ఎప్పుడు తెరుస్తారనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

లాక్ డౌన్ కారణంగా పిల్లలు కొన్ని నెలలుగా పుస్తకాలు పక్కనపడేశారు, ఆటపాటల్లో మునిగిపోయారు. శారీరక శ్రమ లేకుండా సెల్ ఫోన్ గేమ్స్ తో కాలం గడుపుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు ఉన్నా కూడా అవి ఎంతమేరకు ప్రయోజనం అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్స్ తెరుచుకోకపోతే, తరగతి గది బోధన ప్రారంభం కాకపోతే, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పలువురు విద్యారంగ నిపుణులు హెచ్చరించారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ధైర్యం చేసి స్కూల్స్ పునఃప్రారంభించాయి. కర్నాటక, పంజాబ్, ఏపీ వంటి రాష్ట్రాల్లో స్కూల్స్ తెరుచుకున్నాయి. తమిళనాడులో సెప్టెంబర్ 1నుంచి స్కూల్స్ తెరవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా ఏపీలో స్కూల్ విద్యార్థులకు కరోనా రావడంతో కలకలం రేగింది. ముందు జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారినుండి పిల్లలు తప్పించుకోలేకపోయారు. ప్రస్తుతానికి స్కూల్ మూసేసి విద్యార్థులకు సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లాలోని ఇతర స్కూల్స్ లో మరింత పగడ్బందీగా కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలిచ్చారు.