సూపర్ హిట్ తల్లీకొడుకులు మళ్లీ కలిశారు

అప్పుడెప్పుడో పాతికేళ్ల కిందట వచ్చింది సిసింద్రీ అనే సినిమా. ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న అఖిల్ అక్కినేని, తనకు ఊహ తెలియని వయసులో చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో అఖిల్ కు తల్లిగా నటించింది ఆమని. ఆ తర్వాత మళ్లీ ఈ ఆన్ స్క్రీన్ తల్లీకొడుకులు కలిసి నటించలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ కలిసింది.

ప్రస్తుతం అఖిల్ చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అతడికి తల్లిగా నటించింది ఆమని. ఈ విషయాన్ని యూనిట్ కాస్త సీక్రెట్ గా ఉంచే ప్రయత్నం చేసింది. కానీ ఆమని మాత్రం బయటపెట్టేసింది.

“అఖిల్ కు తల్లిగా నటించింది నేనే. అప్పుడెప్పుడో సిసింద్రీ టైమ్ లో అతడికి తల్లిగా నటించాను. మళ్లీ ఇన్నాళ్లకు అఖిల్ ను కలవడం ఆనందంగా ఉంది. అఖిల్ కూడా నన్ను అమ్మలానే ఫీల్ అవుతాడు. సెట్స్ కు వచ్చిన వెంటనే ముందు నన్నే పలకరిస్తాడు. గట్టిగా కౌగిలించుకొని అమ్మా అని పిలుస్తుంటాడు. నాక్కూడా అఖిల్ ను చూడగానే ఓ రకమైన మాతృత్వ భావన కలుగుతుంది.”

ఇలా అఖిల్ కు మరోసారి తల్లిగా నటిస్తున్న విషయాన్ని బయటపెట్టింది ఆమని. తొలిసారి అఖిల్ కు తల్లిగా నటించినప్పుడు ఆ విషయం అతడికి తెలియదని, ఈసారి మాత్రం తను, అఖిల్ బాగా కలిసిపోయామని, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటామని చెబుతోంది ఆమని.