సీటీమార్ ట్రయిలర్.. పక్కా మాస్

`సౌత్ కా స‌త్తా మార్ కే నై.. సీటీమార్ కే దిఖాయేంగె` అని స‌వాలు విసురుతున్నారు ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌. అస‌లు గోపీచంద్ ఆ రేంజ్‌లో ఎందుకు ఛాలెంజ్ విసిరారో అర్థం చేసుకోవాలంటే `సీటీమార్` సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది. సెప్టెంబ‌ర్ 10న బాక్సాఫీస్‌తో క‌లెక్ష‌న్స్ క‌బ‌డ్డీ ఆడ‌టానికి సిద్ధ‌మైన భారీ యాక్ష‌న్ స్పోర్ట్స్ డ్రామా `సీటీమార్‌`.

గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోహీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో నేష‌న‌ల్ గేమ్ క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న‌ ప్రేక్ష‌కుల‌ను ప‌క్కా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో అలరించడానికి సిద్ధంగా ఉన్న `సీటీమార్‌` ట్రైల‌ర్‌ను ఈరోజు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

`ఇక్క‌డ ఆడ‌పిల్ల‌లు వేసుకునే డ్రెస్ లెంగ్త్‌ను బ‌ట్టి క్యారెక్ట‌ర్ డిసైడైపోతుంది` అని రావు ర‌మేశ్ చెప్పిన డైలాగ్.. `మ‌న‌దేశంలో మ‌గాళ్లు 60 ఏళ్లు బ‌తికి చ‌చ్చిపోతున్నారు. ఆడాళ్లు 60 ఏళ్లు బ‌తుకుతున్నారు కానీ 20 ఏళ్లకే చ‌చ్చిపోతున్నారు` అని గోపీచంద్ ఊరి జ‌నాన్ని ఉద్దేశించి చెప్పే మ‌రో డైలాగ్‌ ట్రయిలర్ లో హైలెట్స్ గా నిలిచాయి.

గోపీచంద్ మాస్ హీరోయిజం, త‌మ‌న్నా గ్లామ‌ర్‌తో పాటు.. ఈ సినిమాలో ఆమె మంచి పెర్ఫామెన్స్ రోల్
చేసింద‌ని తెలుస్తుంది. ఇక దర్శ‌కుడు సంప‌త్ నంది.. మ‌రోసారి త‌న‌దైన మార్క్ మూవీని భారీ లెవ‌ల్లో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కించాడు.