భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అదిరింది

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘భీమ్లా నాయక్’ తొలి గీతం విడుదలైంది. తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సాంగ్ ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఆయన చిత్రంలోని అద్భుతమైన గీతాన్ని విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని తన స్పందనను తెలియచేశారు.

భీమ్లా నాయక్ దమ్ము… ధైర్యానికి అక్షరరూపంగా నిలుస్తుందీ గీతం. ఈ గీతంలోని ప్రతి పదం- తప్పు చేసే వాళ్లకు భీమ్లా ఓ సింహ స్వప్నం అని చెబుతుంది. భీమ్లా వ్యక్తిత్వం… డ్యూటీలో నిబద్ధత… తెగువను వెల్లడిస్తుంది ఈ పాట. కథానాయకుడి గొప్పదనాన్ని చెప్పేలా ఉంది సాహిత్యం. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. 2022 జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.