హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకరరావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో పవన్ లుక్ పాతదే. కొత్త స్టిల్ కూడా కాదు. ఏదైనా కొత్తదనం ఉందంటే అది రిలీజ్ డేట్ మాత్రమే. ఈ పోస్టర్ ద్వారా హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌ల్, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా
తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ 50 శాతం పూర్త‌యింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్
అవుతుంది. ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నారు.