ఈసారి కూడా రీమేక్ మూవీనే

తన పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ తళ్లూరి
నిర్మాణంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవన్. అయితే ఇప్పుడీ ప్రాజెక్టుకు
సంబంధించి ఓ చిన్న మెలిక పెట్టాడు పవన్ కల్యాణ్. కేవలం 3 నెలల్లో సినిమాను పూర్తిచేయాలనేది ఆ
షరతు.

నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ కంటే ముందే రామ్ తళ్లూరికి సినిమా చేయాలి పవన్. అందుకే హరిహర
వీరమల్లు సినిమా పూర్తవ్వగానే.. నేరుగా 3 నెలల కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ అయ్యాడట పవన్. ఆ 3 నెలల
తర్వాత హరీశ్ శంకర్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వాలనేది ప్లాన్.

దీంతో రామ్ తళ్లూరి ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. సురేందర్ రెడ్డి దగ్గర ఒరిజినల్ స్టోరీ ఉంది. దాన్ని
పెట్టుకొని, స్టోరీ డిస్కషన్లు పూర్తిచేసి 3 నెలల్లో పూర్తిచేయడం కష్టం. రీసెంట్ గా బయటకు వదిలిన పోస్టర్ లో కూడా ఒరిజినల్ స్టోరీకి సంబంధించిన ఎలిమెంట్సే చూపించారు.

ఈ స్టోరీతోనే సెట్స్ పైకి వెళ్లాలనుకుంటే హరీష్ శంకర్ సినిమా పూర్తయ్యేవరకు ఆగాల్సిందే. హరీష్ సినిమా
కంటే ముందే సెట్స్ పైకి రావాలనుకుంటే మాత్రం రీమేక్ చేయాల్సిందే. మరి రామ్ తళ్లూరి, సురేందర్ రెడ్డి కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.