టక్ జగదీష్ కు మద్దతిచ్చిన సీటీమార్

నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇక గోపీచంద్ చేసిన సీటీమార్ సినిమా
థియేటర్లలోకి వస్తోంది. ఒకే రోజు వస్తున్న ఈ రెండు సినిమాల మధ్య ప్రత్యేకమైన పోటీ నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై గోపీచంద్ స్పందించాడు. ఆశ్చర్యంగా టక్ జగదీష్ సినిమాకు మద్దతు పలికాడు గోపీచంద్.

“ఓటీటీల్లో విడుద‌ల‌వుతున్న సినిమాల గురించి నేను కామెంట్ చేయ‌ను. వాళ్ల స్థానంలో కూర్చుని ఆలోచిస్తే అస‌లు విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఏ నిర్మాత అయినా ఆరేడు నెల‌ల్లో సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేయాల‌ని అనుకుంటాడు. ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు చేస్తారు. ఆల‌స్యం అయ్యే కొద్ది వ‌డ్డీలు
పెరుగుతుంటాయి క‌దా. వాళ్ల ప‌రిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఓటీటీ కూడా మంచి ఫ్లాట్‌ఫామ్‌.
భ‌విష్య‌త్తులో ఓటీటీ ఇంకా బావుంటుంద‌ని అనుకుంటున్నాను. థియేట‌ర్స్ ఎప్ప‌టికీ ఉంటాయి. ఓటీటీ అనేది ఆడిష‌న‌ల్ అడ్వాంటేజ్ అనుకోవాలి.”

ఇలా టక్ జగదీష్ సినిమాకు పూర్తి మద్దతు ప్రకటించాడు గోపీచంద్. అన్నీ అనుకూలించాయి కాబట్టి తమ
సినిమా థియేటర్లలోకి వచ్చిందని, లేదంటే సీటీమార్ కూడా ఓటీటీలోకే వచ్చి ఉండేదనే అభిప్రాయాన్ని
వ్యక్తంచేశాడు గోపీచంద్. ఇక సినిమాలో తన మహిళా కబడ్డీ జట్టుపై కూడా స్పందించాడు ఈ హీరో.

“మా అమ్మాయిల క‌బ‌డ్డీ టీమ్‌లో నలుగురు నిజ‌మైన క‌బ‌డ్డీ ప్లేయ‌ర్స్ ఉన్నారు. నేష‌న‌ల్స్ ఆడారు. షూటింగ్ స‌మ‌యంలో వారితో మాట్లాడాను. ఆ స‌మ‌యంలో వారు ఎలా క‌ష్ట‌ప‌డి ఆ స్థాయికి వ‌చ్చారనే విష‌యం తెలిసింది. నిజంగా మ‌న‌లో ఆటగాళ్లు ఓ స్థాయికి చేరుకోవాలంటే ఎలాంటి క‌ష్టాలు దాటాలో తెలిసిందే. వాళ్ల క‌ష్టాలు తెలిసిన త‌ర్వాత బాధేసింది. న‌లుగురు ప్లేయ‌ర్స్ మిన‌హా మిగ‌తా వారంద‌రూ కొత్త‌వాళ్లే.. మూడు నెల‌ల పాటు ప్రాక్టీస్ చేశారు. వాళ్ల ప్రాక్టీస్ స‌మ‌యంలో మోకాళ్లు దెబ్బ‌లు త‌గిలించుకుని వెళుతుండేవారు. వాళ్ల‌ని చూస్తే పాప‌మ‌నిపించేది. కానీ వాళ్లు అవేమీ ప‌ట్టించుకోకుండా చాలా డేడికేష‌న్‌తో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.”

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమా రేపు థియేటర్లలోకి రాబోతోంది. గోపీచంద్ సరసన తమన్న ఇందులో హీరోయిన్ గా నటించింది.