ఇదే ఫస్ట్ టైమ్ అంటున్న హీరోయిన్

కెరీర్ లో మొదటి సారి ఓ రీమేక్ చేసినట్టు ప్రకటించింది హీరోయిన్ నభా నటేష్. అదే మాస్ట్రో మూవీ. హిందీలో సూపర్ హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ ఇది. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసిసంది.

“ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే అద్బుతంగా నటించింది. కానీ అది నేను ఎలా చేయగలను? అని భయం వేసింది. కానీ మళ్లీ సినిమా చూడకూడదు..ప్రభావితం అవుతాను అని అనుకున్నాను. అందుకే మరోసారి సినిమా చూడకుండా నా స్టయిల్ లో చేశాను.”

ఫస్ట్ టైమ్ రీమేక్ చేసిన అనుభూతి చాలా బాగుందంటున్న నభా, అదే టైమ్ లో టెన్షన్ గా కూడా
ఉందంటోంది. అయితే హిందీ వెర్షన్ లో రాధిక చేసిన బోల్డ్ సీన్లు, తెలుగులో ఉండవని పరోక్షంగా చెప్పేసింది.

“కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారో చూడాలనే ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.”

లాక్ డౌన్ టైమ్ లో చాలా జాగ్రత్తగా షూటింగ్ చేశామని చెప్పుకొచ్చిన నభా నటేష్.. నితిన్ తో వర్క్ చేయడం చాలా బాగుందంటోంది. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేశామో, ఎప్పుడు ఫినిష్ చేశామో కూడా తెలియకుండా అయిపోయిందంటోంది.