వర్క్ ఫ్రమ్ ఆఫీస్ – పిలుపునిచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలు..

దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆఫీస్ ల బాట పడుతున్నారు. ఇన్నాళ్లూ ఇంటి దగ్గరే ల్యాప్ టాప్ ముందు పెట్టుకుని ఊద్యోగాలు చేసినవారంతా ఇప్పుడు ఆఫీస్ లకు వెళ్లడం మొదలు పెట్టారు. ముందుగా విప్రో కంపెనీ ఉద్యోగులకు పిలుపునిచ్చింది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు, ఎలాంటి అనారోగ్యం లేనివారు ఆఫీస్ లకు రావాలని ఆదేశాలిచ్చింది. అయితే సామాజిక దూరం పాటించగలిగేలా కేవలం 50శాతం మందినే ఆఫీస్ లకు రమ్మంటోంది. వీరికి కూడా వారంలో కేవలం రెండు రోజులే పని. మిగతా 50శాతం మంది మిగిలిన రెండురోజులు ఆఫీస్ లకు వచ్చేలా టైమ్ టేబుల్ ఫిక్స్ చేసింది.

విప్రో తోపాటు టీసీఎస్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా త్వరలో ప్రకటన విడుదల చేస్తాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోవడం, థర్డ్ వేవ్ పై ముందస్తు భయాలేవీ లేకపోవడం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా వ్యాక్సినేషన్ చేయించుకుని రెడీగా ఉండటంతో కంపెనీలు వారిని ఆఫీస్ లకు రమ్మని పిలుస్తున్నాయి.

హైబ్రిడ్ మోడల్ వర్క్ అంటూ కొత్త విధానాన్ని తెరపైకి తెస్తున్నాయి కంపెనీలు. అంటే ఇన్నాళ్లూ వారానికి రెండు రోజులు సెలవు తీసుకున్న ఉద్యోగులు, ఇప్పుడు వారానికి రెండు రోజులు ఆఫీస్ కి వస్తారు, మిగతా ఐదు రోజులు ఇంటి వద్దనుంచే పనిచేస్తారన్నమాట. ఆఫీస్, లేదా ఇల్లు.. రెండు చోట్లా పనిచేసేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ కరోనా కేసుల పెరిగినా, థర్డ్ వేవ్ వచ్చినా.. హడావిడి పడకుండా పనివిభజన జరిగిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆఫీస్ లు మూసి వేయడం వల్ల పరోక్షంగా కంపెనీలకు వాటి నిర్వహణ భారం తగ్గింది. అయితే ఏడాదిన్నరగా ఇంటినుంచే పనిచేస్తున్న ఉద్యోగుల మానసిక స్థితి కూడా కట్టు తప్పుతోందని ఇటీవల పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్ లకు రావాలంటూ పిలుపునిచ్చాయి. ఫస్ట్ వేవ్ తర్వాత ఇంత ధైర్యం చేయలేదు కానీ, ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గిపోవడం, కరోనా సోకినవారు వైద్యం ద్వారా త్వరగానే కోలుకోవడంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు ముందడుగు వేశాయి.