వ్యాక్సిన్స్ ఫర్ సేల్!

దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. టీకాల విషయంలో రెండు నెలల్లోనే సీన్ రివర్స్ అయింది. మొన్నటి వరకూ టీకాలు లేక ఇక్కట్లు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సగం ధరకే టీకాలు వేస్తాం అన్నా.. స్లాట్స్ బుక్ అవ్వట్లేదు.

టీకాలు ఇప్పుడు ఫుల్ గా స్టాక్ ఉన్నాయి. ప్రతీ డోసుకు డిస్కౌంట్ ఇస్తామని, సర్వీస్ ఛార్జీలు కూడా తీసుకోమంటూ.. ఆసుపత్రులు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు ఎంఆర్‌పీ ధరలకే డోసులను విక్రయిస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా టీకాల నిల్వలు ఫుల్ గా ఉన్నాయి. దాంతో టీకాలను ఆఫర్ సేల్స్ లో అమ్మాల్సి వస్తోంది.

నేరుగా తయారు కేంద్రాల నుంచి డోసులను కొనుగోలు చేసే వెసులుబాటు ఉండడంతో 80 శాతం ఆసుపత్రులు ముందుగానే భారీ స్థాయిలో డోసులను కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున చేపట్టడంతో జనమంతా ప్రభుత్వ కేంద్రాల్లోనే వ్యాక్సిన్స్ వేయించుకున్నారు. దాంతో ప్రైవేట్‌ కేంద్రాలకు వెళ్లే వారి సంఖ్య 70 శాతం పడిపోయింది. అలా వ్యాక్సిన్స్ అన్నీ స్టాక్ ఉండిపోయి, సగం ధరలకే ఇచ్చేయాల్సి వస్తోంది.

అంతేకాదు వ్యాక్సిన్ కేంద్రాల్లో రద్దీ కూడా బాగా తగ్గింది. గతంలో గంటల తరబడి నిలబడిన వారు నేడు కేవలం 5 నిమిషాల్లో టీకా వేయించుకుని బయటకొచ్చేస్తున్నారు. రెండు నెలల క్రితం టీకాలు లేక డబుల్ రేటులో వ్యాక్సిన్ పొందే పరిస్థితి కాస్తా.. ఇప్పుడు సగం ధరలకు పంపిణీ చేస్తామన్నా తీసుకునే వారు లేని పరిస్థితికొచ్చింది. మొత్తానికి వ్యా్క్సిన్స్ పరిస్థితి ఇలా మారిందన్న మాట.