ఆ సినిమా వాయిదా పడక తప్పదా?

సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఇప్పుడు ఆతడు నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలపై ఆ ప్రభావం పడింది. తప్పనిసరి పరిస్థితుల మధ్య రిపబ్లిక్ సినిమాను వాయిదా వేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కొన్ని రోజుల కిందట సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అంతకంటే ముందే రిపబ్లిక్ సినిమా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక రేపోమాపో సాయిధరమ్ తేజ్ కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ చేస్తాడనుకున్న టైమ్ లో యాక్సిడెంట్ కు గురయ్యాడు. దీంతో రిపబ్లిక్ సినిమా రిలీజ్ డైలమాలో పడింది.

నిజానికి సాయితేజ్ తో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో సాయితేజ్ జిల్లా కలెక్టర్ గా నటించాడు. కాబట్టి థ్యాంక్ యు కలెక్టర్ పేరిట నిజమైన కలెక్టర్లతో ఓ కార్యక్రమం అనుకున్నారు. కానీ సాయితేజ్ యాక్సిడెంట్ తో అన్ని ప్రచార కార్యక్రమాలు నిలిచిపోయాయి. లెక్కప్రకారం, అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ అవ్వాలి.