హిమాచల్​ సీఎం మార్పు.. బీజేపీ స్కెచ్​ ఏమిటి?

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బీజేపీపై కొంత వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. పెట్రోల్​, గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది.

ఇప్పటికే ఉత్తరాఖండ్​, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చారు. అక్కడి రాజకీయ పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం ఉండటంతో బీజేపీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. త్వరలో హిమాచల్ ప్రదేశ్​ ముఖ్యమంత్రిని కూడా మార్చబోతున్నట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్‌కు బీజేపీ హైకమాండ్​ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ సీఎం మార్పు తప్పదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

త్వరలో హర్యానా, మధ్యప్రదేశ్‌ సీఎంలను కూడా మారుస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను సీఎం పదవి నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పుపై మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో అమిత్‌ షా ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.

మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బీజేపీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఏ మాత్రం నచ్చడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దీంతో బీజేపీ సైతం దిద్దుబాటు చర్యలకు దిగింది. తమకు అనుకూలంగా ఉన్న వర్గాలకు దూరంగా కాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రులను మారుస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.