అది ఆగిపోయింది.. ఇది మొదలైంది

జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత నవీన్ పొలిశెట్టి తొందర పడలేదు. ఆ సక్సెస్ ను
కంటిన్యూ చేసే క్రమంలో అవసరమైతే గ్యాప్ తీసుకోవాలని కూడా అనుకున్నాడు. అయితే అతడికి ఎక్కువ
గ్యాప్ ఇవ్వకుండానే మంచి ప్రాజెక్టు పడింది. అనుష్క లీడ్ రోల్ లో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై డిఫరెంట్ సినిమా ఒకటి సెట్ అయింది. కానీ అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆ సినిమా ఆగిపోయింది.

అలా తన ప్రమేయం లేకుండానే గ్యాప్ ఎదుర్కొన్న నవీన్ పొలిశెట్టి, ఎట్టకేలకు ఓ సినిమాను ఎనౌన్స్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా ప్రకటించాడు. ఈ ప్రాజెక్టులో ఓ పెద్ద విశేషం ఉంది. ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ దర్శకుడు త్రివిక్రమ్ ది. తన భార్య సాయిసౌజన్య పేరిట ఈ బ్యానర్ ను స్థాపించి, ఆమెను నిర్మాతను చేశాడు త్రివిక్రమ్.

“ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్తమవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము” అంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ ఎనౌన్స్ మెంట్ తోనే ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమౌతోంది. ఈ సినిమాతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.