కొలువుదీరిన టీటీడీ పాలకమండలి.. 50మంది ప్రత్యేక ఆహ్వానితులు..

టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్య పెంచుతారని, దీనికి సంబంధించి చట్ట సవరణ చేస్తారని ఊహాగానాలున్నా.. ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే టీటీడీ పాలక మండలి కొలువుదీరింది. అయితే అదనంగా 50మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించడమే ఇక్కడ కొసమెరుపు. పాలక మండలిని నియమిస్తూ ఒకజీవో, ప్రత్యేక ఆహ్వానితులకోసం మరో జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. ప్రత్యేక ఆహ్వానితులకు బోర్డు సభ్యులతో సమానంగా దర్శన అవకాశం ఉంటుందని, బోర్డు సమావేశాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

చైర్మన్ సహా 25మంది..
టీటీడీ పాలకమండలికి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి నియమితులైన తర్వాత పాలకమండలి సభ్యులకు కూడా మరో అవకాశం ఇస్తారని అనుకున్నారు. కొంతమంది పాత సభ్యులను కొనసాగిస్తూనే.. ఈసారి పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు కొత్తగా అవకాశం కల్పించారు. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల స్థానంలో ఇప్పుడు మరో ముగ్గురికి అవకాశమిచ్చారు. ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కు చోటు కల్పించారు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు బోర్డులో స్థానం కల్పించారు. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌ ను నియమించారు. వీరిద్దరికీ బోర్డులో ఓటింగ్‌ హక్కు లేదు కానీ, ఇతర సభ్యుల లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఎక్స్ అఫిషియో సభ్యులుగా దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవదాయ శాఖ కమిషనర్, తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్, టీటీడీ ఈవో వ్యవహరిస్తారు.

ప్రత్యేక ఆహ్వానితులకూ అన్ని సౌకర్యాలు..
పాలక మండలి సభ్యుల సంఖ్య పెంచుతారనే ఊహాగానాలున్నా, దానికి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉండటంతో.. ఈ ఏడాది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 50మంది జాబితా విడుదల చేసింది ప్రభుత్వం. శ్రీవారి దర్శనానికి సంబంధించినంత వరకు వారిని టీటీడీ పాలకమండలి సభ్యులతో వీరిని సమానంగా పరిగణిస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలంతో పాటు, ప్రత్యేక ఆహ్వానితుల పదవీకాలమూ ముగుస్తుందని పేర్కొన్నారు.