కారు కేసీఆర్ దే.. కానీ స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో..

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బీ టీమ్ గా ఎంఐఎంని అభివర్ణిస్తుంటాయి ప్రతిపక్షాలు. కానీ అదే బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ ఎంఐఎం పై విమర్శలు గుప్పించింది. మజ్లిస్ కి భయపడి, ఒవైసీతో లాలూచీ పడి కేసీఆర్, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదంటూ మండిపడ్డారు కేంద్ర మంత్రి అమిత్ షా. కారు కేసీఆర్ దే అయినా స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో ఉందని ఎద్దేవా చేశారు. నిర్మల్ లో జరిగిన విమోచన దినోత్సవ బహిరంగ సభలో పాల్గొన్నారాయన. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మజ్లిస్‌ ని ఓడించినపుడే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ లభిస్తుందని, అది బీజేపీతోనే సాధ్యమని అన్నారు అమిత్ షా. తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చి బీజేపీ, కేంద్ర కేబినెట్ పదవులిచ్చిందని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రజల విముక్తికోసం తెలంగాణలో బండి సంజయ్‌ సంగ్రామ యాత్ర చేస్తున్నారని కితాబిచ్చిన అమిత్ షా.. హుజూరాబాద్ లో రాజన్నను గెలిపించుకోవాలంటూ ఈటలకు మద్దతు తెలిపారు. సంగ్రామ యాత్రతో పాటు 119 నియోజకవర్గాల్లో జనజాగృతి రూపంలో ముందుకు వెళ్తామని చెప్పారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ కొడుకు, కూతురికి తప్ప మరొకరికి అవకాశం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మతం ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అంతరించిపోతోందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ కి అది ప్రత్యామ్నాయం కాబోదన్నారు. కాంగ్రెస్‌ కి ఆ శక్తి ఉన్నా, మజ్లిస్‌ భయంతో టీఆర్ఎస్ చేసిన పనులే చేస్తుందని చెప్పారు అమిత్ షా.

నయా నిజాం..
సర్దార్ వల్లభాయ్ పటేల్ ని తమవాడిగా చెప్పుకోవడంలో, ఆయన వారసులుగా ప్రకటించుకోవడంలో బీజేపీ నేతలు ముందుంటారు. తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా ని నయా సర్దార్ అంటూ ఆకాశానికెత్తేశారు తెలంగాణ బీజేపీ నేతలు. అదే సమయంలో కేసీఆర్ ని నయా నిజాంగా అభివర్ణిస్తూ.. ఆయన్ను రాష్ట్రం నుంచి తరిమి కొడతామంటూ సవాల్ విసిరారు. పటేల్‌ కన్నెర్ర చేస్తే రజ్వీ పారిపోయాడని, అభినవ సర్దార్‌ అమిత్‌ షా ఉరిమితే కేసీఆర్‌ పారిపోవడం ఖాయమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నయా నిజాంగా మారిన కేసీఆర్‌ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టే సమయం దగ్గరపడిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఆసక్తి చూపని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీచ పాలనను భవిష్యత్తులో పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తామని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడంలేదని ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యను ప్రశ్నించిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే ఎంఐఎంకి భయపడి మరచిపోయారన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మేనల్లుడు, కుమార్తె, కొడుకుకి పంచిపెట్టారని, సీఎంను గద్దె దింపడానికి పౌరుషం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు టీఆర్ఎస్ ని వదిలి తమతో కలసి రావాలని పిలుపునిచ్చారు. తెలగాణ విమోచన దినోత్సవం పేరుతో… బండి సంజయ్ సంగ్రామ యాత్రకు ఊపు తెచ్చేందుకు అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. పనిలో పనిగా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపుకి పిలుపునిచ్చారు. ఉత్తరాదిన ఎంఐఎం తమకు బీ టీమ్ కాదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.