ఏపీలో కరోనా ఆంక్షల కొనసాగింపు..

కరోనా కేసులు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టు కనిపించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్త చర్యలను కొనసాగించింది. నైట్ కర్ఫ్యూని ఈనెల 30వరకు పొడిగించింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి రోజు రాత్రి 11గంటలనుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నా.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పగటిపూట కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలకు అనుమతిస్తున్న అధికారులు, ఆ తర్వాత జన సంచారంపై ఆంక్షలు పెడుతున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తేసి చాలా కాలం అవుతోంది. ఏపీలో మాత్రం నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తున్నారు, మరోసారి దాన్ని పొడిగించారు.

మరోవైపు ఏపీలో రోజుకి 50వేలకు తగ్గకుండా కొవిడ్ పరీక్షలు జరుపుతున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1174మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ఒకరోజు వ్యవధిలో 9మంది మృతి చెందారు. రికవరీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరందుకుంది. చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు.. జిల్లాల్లో మాత్రమే 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లాలో కనిష్టంగా 5 కేసులు మాత్రమే వెలుగు చూశాయి.

స్థానిక ఫలితాల వేళ ర్యాలీలపై నిషేధం..
సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తై ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు ప్రకటించబోతున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై కూడా ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఊరేగింపులు, టపాకాయలు కాల్చేందుకు అనుమతి నిరాకరించారు అధికారులు. రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని పోలీసులు కోరారు.