ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. సభ్యుల్ని తమ వైపు తిప్పుకునే
ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రతి రోజూ ఈ రెండు ప్యానెల్ సభ్యులు నైట్ పార్టీలు నిర్వహిస్తూ, తమ శిబిరాల్ని
పెంచుకునే ఏర్పాట్లలో ఉన్నారు.

తన ప్యానెల్ ను ఇప్పటికే ప్రకటించాడు ప్రకాష్ రాజ్. ఏ పదవికి ఎవరు పోటీ పడబోతున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. ఇప్పుడు మంచు విష్ణు ప్యానెల్ అదే పనిలో ఉంది. ఇందులో భాగంగా రఘుబాబు, బాబుమోహన్ ను రంగంలోకి దించబోతోంది మంచు విష్ణు ప్యానెల్. వీళ్లలో రఘుబాబు జనరల్ సెక్రటరీ పోస్ట్ కు పోటీ చేసే అవకాశం ఉంది.

ఈసారి జనరల్ సెక్రటరీ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జీవిత రాజేశేఖర్, మంచు విష్ణు ప్యానెల్ నుంచి రఘుబాబు బరిలో నిలవగా.. వీళ్లిద్దరికీ పోటీగా బండ్ల గణేష్ కూడా పోటీ చేయడానికి సిద్ధమౌతున్నారు. అలా జనరల్ సెక్రటరీ పోస్ట్ కు త్రిముఖ పోటీ తప్పేలా లేదు. కేవలం జీవిత రాజశేఖర్ పై కోపంతోనే బండ్ల, బరిలో నిలిచారు. ఆయన చివరివరకు పోటీలో ఉంటారా లేక ఆఖరి నిమిషంలో మెగా కాంపౌండ్ లాబీయింగ్ తో తప్పుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.