ఏపీ థియేటర్లలో ఇక అన్నీ ఆన్ లైన్

ఆంధ్రప్రదేశ్ లో టిక్కెటింగ్ వ్యవస్థపై క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లూ వస్తుందా రాదా అనే అనుమానాల మధ్య ఊగిసలాడిన ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థపై మంత్రి పేర్ని నాని విస్పష్టంగా ప్రకటన చేశారు. త్వరలోనే ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా ప్రేక్షకులకు వినోదం అందిస్తామని ఆయన ప్రకటించారు.

ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్మితే తమకు నష్టాలు వస్తాయని కొంతమంది నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఆందోళన
చేసినట్టు గడిచిన వారం రోజులుగా వార్తలొచ్చాయి. టాలీవుడ్ కూడా ఈ వ్యవస్థకు వ్యతిరేకం అంటూ ఓ
మీడియా కోడై కూసింది. అయితే ఎప్పుడైతే చిరంజీవి, సురేష్ బాబు లాంటి వ్యక్తులే ఆన్ లైన్ వ్యవస్థ
పెట్టమన్నారంటూ ప్రభుత్వం ప్రకటించిందో అప్పట్నుంచి ఆ పుకార్లు ఆగిపోయాయి. ఆన్ లైన్ వ్యవస్థకు లైన్ క్లియర్ అయింది.

ఈరోజు టాలీవుడ్ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రి పేర్ని నాని. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు ఇచ్చే వ్యవస్థకు సినీ ప్రముఖలంతా సంపూర్ణ మద్దతు తెలిపారు. దీంతో ఆన్ లైన్ వ్యవస్థకు మార్గం సుగమమైంది.

ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సినిమా వసూళ్లలో పారదర్శకత వస్తుంది. ఇకపై నిర్మాతలు, తమ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు చేసిందంటూ చెప్పుకోలేరు. పైగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని జగన్ సర్కారు ఏ మేరకు కార్యరూపంలోకి తీసుకొస్తుందో చూడాలి.