ప్రతి రూపాయి ప్రజలకే: సోనూ సూద్

ఈమధ్య నటుడు సోనూ సూద్ ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన సంగతి
తెలిసిందే. 4 రోజుల పాటు ఏకథాటిగా జరిగిన ఈ సోదాల్లో సోనూ సూద్.. 20 కోట్ల రూపాయల మేర పన్ను
ఎగవేసినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. ఈ వ్యవహారంపై 4 రోజులుగా మౌనంగా ఉన్న సోనూ సూద్ ఈరోజు
స్పందించాడు. తనకు చెందిన ప్రతి రూపాయి ప్రజలకే అందుతుందని మరోసారి స్పష్టంచేశాడు.

“విషయం ఏదైనా ప్రతిసారి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం
చెబుతుంది. ప్రజలందరికీ సేవ చేయాలని మంచి మనసుతో ప్రతిజ్ఞ చేసుకున్నాను. నా సంస్థలోని ప్రతి
రూపాయి, సాయం కోసం ఎదురుచూసే వాళ్లకు అందుతుంది.”

ఇలా ఐటీ దాడులపై పరోక్షంగా స్పందించాడు సోనూ సూద్. గడిచిన 4 రోజులుగా వ్యక్తిగత వ్యవహారాలతో
బిజీగా ఉండడం వల్ల అందుబాటులోకి రాలేకపోయానని, ఇకపై మళ్లీ ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని సోనూ ప్రకటించాడు. తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే సంస్థల నుంచి వచ్చే డబ్బును కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతానని సోనూ ప్రకటించాడు.