మేం బహిష్కరించాం.. మేం గెలిచి చూపించాం..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయం స్పష్టమైంది. దాదాపుగా 90శాతం సీట్లను వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలతో కలుపుకొని ఫలితాలు వెలువడిన స్థానాల్లో మొత్తం వైసీపీకి 627 దక్కాయి. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఇదివరకే ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలతో కలుపుకొని 8,075 స్థానాలు వైసీపీకి దక్కాయి. టీడీపీకి 6 జడ్పీటీసీ స్థానాలు 809 ఎంపీటీసీ స్థానాలు దక్కగా.. జనసేన ఈ ఎన్నికల్లో కాస్త పుంజుకున్నట్టు తెలుస్తోంది. 1 జడ్పీటీసీ, 164 ఎంపీటీసీ స్థానాలను జనసేన కైవసం చేసుకుంది. బీజేపీ, వామపక్షాల ఉనికి నామమాత్రంగానే ఉంది.

మేం బహిష్కరించాం కాబట్టే..
పరిషత్ ఎన్నికల ఫలితాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమదైన శైలిలో స్పందించాయి. తాము ఎన్నికలను బహిష్కరించాం కాబట్టే వైసీపీ గెలిచిందని టీడీపీ నేతలు వివరణ ఇచ్చుకున్నారు. అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకున్నారని అందుకే తాము ఎన్నికలను బహిష్కరించామని, వైసీపీ గెలుపుని ప్రజాభిప్రాయంగా పరిగణించకూడదని అన్నారు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రభుత్వాన్ని రద్దుచేసి వెంటనే ప్రజాభిప్రాయాన్ని కోరాలని సవాల్ విసిరారు.

మేం గెలిచి చూపించాం..
ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించి టీడీపీ బహిష్కరణ నాటకమాడిందని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇక హైదరాబాద్ కే పరిమితం కావాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. కుప్పం ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుందని, వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ సీటు కూడా వైసీపీకే దక్కుతుందని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిమ్మగడ్డ ఇబ్బంది పెట్టినా, కోర్టులకు వెళ్లి టీడీపీ ఎన్నికలను అడ్డుకోవాలని చూసినా, చివరకు న్యాయమే గెలిచిందని, వైసీపీ గెలుపుతో అది మరోసారి రుజువైందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ కూడా ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలతో ప్రజలంతా వైసీపీ వైపే నిలబడ్డారని మరోసారి రుజువైందని అన్నారు జగన్. ఈ గెలుపుతో తమపై బాధ్యత రెట్టింపయిందని చెప్పారు.