వైట్ ఛాలెంజ్: ట్వీట్ నుంచి కోర్ట్ వరకు..

తెలంగాణలో వైట్ ఛాలెంజ్ వ్యవహారం ట్వీట్ నుంచి కోర్టుకి మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దురుద్దేశంతో కొంతకాలంగా తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. డ్రగ్స్‌ కేసులో ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ, ఆ కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన కేటీఆర్, రేవంత్ రెడ్డి దురుద్దేశంతో తన పేరు ప్రస్తావిస్తున్నారంటూ దావాలో పేర్కొన్నారు. దుష్ప్రచారం వల్ల తనకు సంభవించిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ప్రారంభించాలని కోరారు.

మలుపులు తిరిగిన ఛాలెంజ్ వ్యవహారం..
తెలంగాణలో కేటీఆర్‌ ‘డ్రగ్స్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌’ అంటూ రేవంత్‌ చేసిన ఆరోపణలతో మొదలైన వివాదం సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనేక మలుపులు తిరిగి చివరకు కోర్టు కేసు వరకు వచ్చింది. డ్రగ్స్ తీసుకోలేదని నిరూపించుకునేందుకు కేటీఆర్ వైట్ ఛాలెంజ్ కి సిద్దం కావాలని, రక్త పరీక్ష చేయించుకోవాలని కొన్నిరోజుల క్రితం సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ తోపాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా వైట్ ఛాలెంజ్ తీసుకోవాలని, ఈ పరీక్షలో నెగ్గి వారు మరో ఇద్దరికి సవాల్ విసరాలని సూచించారు. యువతకు మంచి సందేశమిచ్చేందుకే ఈ ప్రయత్నం అని ట్విస్ట్ ఇచ్చారు రేవంత్. ఈ నేపథ్యంలో రేవంత్ కు ట్విట్టర్ ద్వారానే బదులిచ్చారు కేటీఆర్. తనతోపాటు రాహుల్ గాంధీ కూడా రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. రాహుల్ గాంధీ, డొనాల్డ్ ట్రంప్, ఇవాంకా అవసరం లేదని, తాను సిద్దంగా ఉన్నానంటూ రేవంత్ మరో ట్వీట్ వేశారు. దీనికి బదులుగా కేటీఆర్ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. చర్లపల్లి జైలు మాజీ ఖైదీతో కలిసి పరీక్షలు చేయించుకుంటే తన ప్రతిష్టను దిగజార్చుకున్నట్టవుతుందని పరోక్షంగా రేవంత్ ని దెప్పిపొడిచారు. తాను పరీక్షలు చేయించుకుని మచ్చలేకుండా బయటకొస్తే, రేవంత్ క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేస్తాడా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. దీంతో వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. లై డిటెక్టర్ పరీక్షలనగానే.. రేవంత్ రెడ్డి సహారా, ఈఎస్‌ఐ కుంభకోణాల్లో కూడా లై డిటెక్టర్‌ టెస్టులు చేస్తాం కేటీఆర్.. మీరు సిద్ధమేనా? అంటూ ప్రశ్నించారు. అక్కడితో కేటీఆర్ కి కోపం తారాస్థాయికి చేరుకుంది. వెంటనే రేవంత్ పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఆవేశం ఎందుకు..? బెదిరింపులు ఎందుకు..?
వైట్ ఛాలెంజ్ ని స్వీకరించేందుకు వెనకడుగేసిన కేటీఆర్, కోర్టు కేసులతో తనని బెదిరించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యే కాకముందే తాను ఎమ్మెల్సీనని చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నానని, జాతీయ పార్టీ కాంగ్రెస్‌ కు తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని చెప్పారు. స్థాయి గురించి మాట్లాడకుండా కేటీఆర్‌ ఎప్పుడు వచ్చినా అమరవీరుల స్థూపం వద్ద చర్చకు తాను సిద్ధమని, గంట ముందు కబురు పెడితే చాలని కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

ఇక రేవంత్ సవాల్ ని స్వీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి అమరుల స్థూపం వద్దకు వచ్చి తాను వైట్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్టు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. అంతే కాదు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారంతా డ్రగ్స్‌ టెస్టు చేయించుకోవాలని, ఆ తర్వాతే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించాలని కోరారు. తన వంతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ లకు వైట్‌ ఛాలెంజ్‌ విసిరారు కొండా. మొత్తమ్మీద రేవంత్, కేటీఆర్ మధ్య మొదలైన ఈ వైట్ ఛాలెంజ్ వ్యవహారం.. రాహుల్ డ్రగ్ డెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. మధ్యలో చంద్రబాబు, లోకేష్ పేర్లను కూడా టీఆర్ఎస్ నేతలు తెరపైకి తేవడం విశేషం.