అమరీందర్ తిరుగుబాటు.. రాహుల్, ప్రియాంకపై సంచలన వ్యాఖ్యలు..

ఇన్నాళ్లూ అధిష్టానానికి నిబద్ధతతో ఉన్న పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. ఒక్కసారిగా స్వరం మార్చారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి వానప్రస్థంలో ఉన్న కెప్టెన్, కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. రాహుల్, ప్రియాంకకు రాజకీయ అనుభవం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సలహాదారులు వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో సిద్ధూ పంజాబ్ సీఎం కాకుండా అడ్డుపడతానని, కచ్చితంగా సిద్ధూని ఓడిస్తామని హెచ్చరించారు. ఆయనపై బలమైన అభ్యర్థిని నిలబెడతానని చెప్పారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే ఉన్న అమరీందర్ సింగ్.. సిద్ధూపై ఏ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడతారనే విషయం మాత్రం చెప్పలేదు.

సిద్ధూని ఓడిస్తామంటే, కాంగ్రెస్ ని ఓడించినట్టేనా..?
వచ్చే ఏడాది పంజాబ్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని ఓడిస్తానని చెప్పిన అమరీందర్ సింగ్, పరోక్షంగా కాంగ్రెస్ ని కూడా మట్టికరిపిస్తానని హెచ్చరించారు. ప్రస్తుతానికి ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా.. విపక్ష నేతలకంటే ఘాటుగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. తనకు తానుగా బయటకు వెళ్లకుండా, పార్టీ వేటు వేస్తే వచ్చే సింపతీకోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

సిద్ధూ ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయనతో దేశ భద్రతకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉందని మరోసారి ఆరోపించారు అమరీందర్ సింగ్. ఎమ్మెల్యేలను గోవాకో, ఇతర ప్రాంతాలకో విమానంలో తీసుకెళ్లే పని తనకు చేతకాదని, జమ్మిక్కులు చేయడం తెలియదని చెప్పారు. తన గురించి గాంధీ కుటుంబానికి బాగా తెలుసని, అయితే అవమానకర రీతిలో తనను పదవినుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరీందర్ తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయనపై వేటు వేసే విషయంలో మాత్రం మరికొన్నాళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది.