పాత పంథాలోకి శివ నిర్వాణ

టక్ జగదీశ్ రిజల్ట్ తేడా కొట్టింది. కొత్త సీసాలో పాత సారా టైపులో ఆల్రెడీ తెలిసిన కథ, సన్నివేశాల్నే
అటు-ఇటు తిప్పి చూపించాడు దర్శకుడు శివ నిర్వాణ. దీంతో అతడిపై చాలా విమర్శలు చెలరేగాయి. వాటి నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్న ఈ దర్శకుడు.. ఇప్పుడిప్పుడే కొత్త కథ రాసే పనిలో ఉన్నాడు.

శివ నిర్వాణకు వైజాగ్ అంటే ఇష్టమనే సంగతి తెలిసిందే. తన కొత్త సినిమాకు సంబంధించిన ఏ పనైనా
అతడు వైజాగ్ లోనే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు కొత్త కథను కూడా వైజాగ్ లోనే రాస్తున్నాడు. దీనికి సంబంధించి ప్రకటన కూడా చేశాడు శివ.

“వైజాగ్ బీచ్ లో ఉన్నాను. నాకు వైజాగ్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలుసు. నేను తీసిన నిన్నుకోరి, మజిలీ సినిమాల్ని మీరంతా ఆదరించారు. ఇప్పుడు మరో ప్రేమకథ రాస్తున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. సముద్రం, కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో, ఈ కథ కూడా అంతే ఒరిజినల్ గా ఉంటుంది.”

ఇలా మరోసారి తను ప్రేమకథల వైపు మళ్లిన విషయాన్ని శివ నిర్వాణ స్పష్టంచేశాడు. అయితే ప్రస్తుతం
రాస్తున్న ప్రేమకథ ఏ హీరో కోసమనే విషయాన్ని మాత్రం శివ బయటపెట్టలేదు. త్వరలోనే విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయబోతున్నాడు శివ. బహుశా విజయ్ కోసమే ఈ ప్రేమకథ రాస్తున్నట్టున్నాడు.