సీమ ప్రాజెక్ట్ ఆపండి.. పాలమూరుని ఆమోదించండి..

రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్ నగర్ జిల్లా ఎడారిగా మారిపోతుందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కి ఫిర్యాదు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాజెక్ట్ ని వెంటనే నిలువరించాలని కోరారు. అదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కి అనుమతులు ఇవ్వాలని, ఇబ్బందులు లేకుండా నీటిని కేటాయించాలని కోరారు. ఈ రెండు ప్రాజెక్ట్ లపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పోటా పోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు ఇరు రాష్ట్రాల అధికారులు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటే, పాలమూరు పథకానికి నీటి కేటాయింపులు లేవని ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కి సీఎం కేసీఆర్ మరోసారి ఫిర్యాదు చేయడం విశేషం.

నోటిఫికేషన్ వాయిదా వేయండి..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం కొత్తగా ఏర్పాటు చేస్తున్న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ ల నోటిఫికేషన్ అమలు తేదీని అక్టోబర్ 14న కాకుండా మరికొంత కాలం వాయిదా వేయాలని కోరారు సీఎం కేసీఆర్. కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను వేగంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. జలవివాద పరిష్కార అంశాన్ని త్వరగా ట్రైబ్యునల్ కి అప్పగించాలన్నారు. ఇదే నెలలో ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్, ట్రైబ్యునల్ అమలు తేదీని వాయిదా వేయాలని కోరారు, ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకోవాలంటూనే, పాలమూరు పథకాన్ని కొనసాగించేందుకు అనుమతులివ్వాలని అభ్యర్థించారు.

తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సన్నద్ధత, గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల అనుసంధానం, విద్యా సౌకర్యాల కల్పన, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు.. వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నా.. కాలు బెణకడంతో ఆయన ఢిల్లీ ప్రయాణం విరమించుకున్నారు. డాక్టర్ల సూచనతో విశ్రాంతి తీసుకుంటున్నారు.