ఎన్నికలే లక్ష్యంగా కొత్త మంత్రి వర్గాలు..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో అధికార పార్టీలు తమ పట్టు నిలుపుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పంజాబ్ లో ముఖ్యమంత్రినే మార్చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా కొత్త మంత్రి వర్గాన్ని కొలువుదీర్చింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో పనిచేసిన చాలామంది మంత్రులకు ఉద్వాసన పలికారు కొత్త సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ. ఆదివారం పంజాబ్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్‌ జిందర్‌ సింగ్‌ రంధావా, ఓపీ సోని ప్రమాణ స్వీకారం చేయగా.. కొత్తగా మరో 15మంది కేబినెట్ లోకి వచ్చారు. వీరిలో ఆరుగురు తొలిసారిగా మంత్రి పదవులు చేపట్టారు.

ఇసుక కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్‌ సింగ్‌ కు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాసినా ఆయనకు పార్టీ మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో చాలామంది అసంతృప్తి వెళ్లగక్కారు. అవినీతి మకిలి అంటినవారిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం సరికాదని పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

ఇక యూపీలో కూడా ఆదివారం మంత్రి వర్గ విస్తరణ చేపట్టింది బీజేపీ సర్కారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పదవి ఊడుతుందని అనుకున్నా.. అధిష్టానం కేవలం మంత్రి వర్గ విస్తరణతోనే సరిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపుతారనుకున్న కీలక నేతలకు కేబినెట్‌ లో స్థానం కల్పించింది. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన సీనియర్‌ నేత జితిన్‌ ప్రసాదకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. బ్రాహ్మణవర్గ ఓటర్లలో ఈయనకు పట్టుంది. ప్రసాదతోపాటు మరో ఆరుగురి చేత గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య గరిష్టస్థాయిలో 60కు చేరింది.