పండగలే కీలకం.. ఆంక్షలు పొడిగించిన కేంద్రం..

పండగల రూపంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. రాబోయే రోజుల్లో దసరా, దీపావళి ఉండటంతో.. కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు పూర్తిగా కొవిడ్ నిబంధనలు పక్కనపెట్టే ప్రమాదం ఉండటంతో.. సాధారణ ఆంక్షలను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉందని, పండగల సీజన్లో జనాలు గుమికూడటం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కరోనా నియంత్రణ చర్యలను వచ్చేనెల 31 వరకు పొడిగిస్తున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటించారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పండగలను జరుపుకొనేలా చూడాలని కోరారు.

ఫస్ట్ వేవ్ ప్రభావం తగ్గి, సెకండ్ వేవ్ మొదలయ్యే ముందు కూడా పండగ సీజన్లో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించారు. కరోనా లేనట్టే ప్రవర్తించారు, అందుకే సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చింది. మరోసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఆంక్షలను పొడిగించింది. ఇటీవల కాలంలో థర్డ్ వేవ్ గురించి వచ్చిన అంచనాలన్నీ తారుమారవుతున్నాయి. వాస్తవానికి నిపుణుల అంచనా ప్రకారం ఈపాటికే థర్డ్ వేవ్ ముప్పు మొదలవ్వాల్సి ఉంది. కానీ కేంద్రం, రాష్ట్రాలు కొవిడ్ నిబంధనల విషయంలో పూర్తి స్థాయి సడలింపులు ఇవ్వలేదు. దీంతో కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.

కేరళ ఉదంతంతో ముందు జాగ్రత్త..
ఆమధ్య కేరళలో బక్రీద్, ఓనమ్ పండగలకు నిబంధనలు పూర్తి స్థాయిలో సడలించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో కేసులు సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో జన సంచారంపై నియంత్రణ ఉంటే కరోనా కచ్చితంగా అదుపులోకి వస్తుందనే భావన బాగా బలపడింది. అందుకే ఏపీ లాంటి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తున్నాయి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సినిమా థియేటర్లకు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. బీహార్ లో తీసుకుంటున్న జాగ్రత్తల వల్లే అక్కడ కరోనా మరణాల సంఖ్య సున్నాకి పడిపోయింది. రాబోయే పండగల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్రం కొవిడ్ నిబంధనలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.