విషవృక్షం నీడలో పవన్ కళ్యాణ్.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్..!

రిపబ్లిక్ ఫంక్షన్లో ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీరంగ సమస్యలపై స్పందించారో అప్పట్నుంచి వైసీపీ నాయకులు తమ మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన పలువురు మంత్రులు, పోసాని కృష్ణ మురళి పవన్ పై విమర్శలు చేయగా తాజాగా ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక విష వృక్షం నీడలో ఉన్నారని, ఆయన అక్కడి నుంచి బయటకు వస్తే తప్ప ముందుకు వెళ్ళలేరని అన్నారు. పది అడుగుల పాదయాత్ర చేస్తే జనం ఎక్కువగా వచ్చారని కారెక్కి వెళ్లిపోయే పవన్.. జగన్ లాగా సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా.. అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ కు అంటూ ఒక సిద్ధాంతం ఉందా.. అది ఆయనకు తెలుసా.. అని మండి పడ్డారు. ఒకసారి టీడీపీతో మరొకసారి కమ్యూనిస్టులు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడని అన్నారు. దొంగ టికెట్ల అమ్మకాలకు సపోర్ట్ చేస్తే పవన్ నాయకుడు ఎలా అవుతాడు అంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ టీడీపీ చేసిన తప్పుల గురించి ఎందుకు ఎత్తి చూపడం లేదని ప్రశ్నించారు. జగన్ కు ప్రజల మద్దతు ఉందని ఆయన జోలికి ఎవరూ రాలేరని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. ఎన్నికల్లో వరుస విజయాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఆన్లైన్ టికెట్ల ప్రక్రియపై ఒక నిర్ణయం తీసుకుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మానుకోవాలని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.